Begin typing your search above and press return to search.

వైసీపీ రొట్టె విరిగి నేతిలో పడుతుందా ?

అధినాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతలా బూస్టింగ్ ఇచ్చినా క్యాడర్ అయితే మాత్రం అసలు చలనం లేకుండా అలా ఉంది.

By:  Tupaki Desk   |   20 Jan 2025 10:30 PM GMT
వైసీపీ రొట్టె విరిగి నేతిలో పడుతుందా ?
X

ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ పార్టీ వారికే తెలియదు అని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీకి అవసరమైన ధీమా కరవు అయింది. అధినాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతలా బూస్టింగ్ ఇచ్చినా క్యాడర్ అయితే మాత్రం అసలు చలనం లేకుండా అలా ఉంది.

ఇక టీడీపీ కూటమిలో అయితే అంతా సాఫీగా సజావుగా పాలన సాగుతోంది. నిజానికి మూడు పార్టీలతో ఏర్పాటు అయిన కూటమిలో విభేదాలు వస్తాయని అంతా భావిస్తారు. కానీ అలాంటివి ఏమీ జరగకపోగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎంతో కో ఆర్డినేషన్ తో ముందుకు సాగుతున్నారు.

పవన్ వైపు నుంచి సమస్య అయితే రాదు అని తేలిపోయిన వేళ అనూహ్యంగా టీడీపీ వైపు నుంచే ఒక చిన్నపాటి తుఫాన్ లా వచ్చింది. అదేంటి అంటే నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయమని. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా ఈ వ్యవహారం మారింది. నిప్పు ఎక్కడ ఉంది అన్నది తెలిసేలోగానే వ్యవహారం చాలా ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో తమ్ముళ్ళు వర్సెస్ జనసైనికులు అన్నట్లుగా సామాజిక మాధ్యమాలలో రచ్చ సాగుతూ వచ్చింది.

ఒక విధంగా ఇది జనసేన టీడీపీల మధ్య చిచ్చు పెట్టేలాగానే ఇష్యూ ఉందని అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అన్న డిమాండ్ మరో వైపు జనసైనికులకు పవన్ కళ్యాణ్ ని తగ్గించాలని చూస్తున్నట్లుగా వినిపిస్తోంది. అంతే కాదు పవన్ కి పోటీగా అన్నట్లుగా కూడా వారు భావిస్తున్నారు

దాంతోనే సోషల్ మీడియాలో ట్వీట్లు అలా వెల్లువలా వచ్చిపడుతున్నాయి. దీని మీద పెద్ద రాజకీయ రాద్ధాంతం సాగింది. అయితే టీడీపీ అధినాయకత్వం సకాలంలో స్పందించి టీడీపీ తమ్ముళ్ళను వద్దు అంటూ వారించింది. ఈ తరహా ప్రకటనలు ఇవ్వవద్దు అని కూడా గట్టిగా హెచ్చరించింది.

అయితే ఇప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. కూటమిలో జనసేన టీడీపీ కలసి ఉంటున్నా తమ్ముళ్ళు సైనికుల మనసులో మంటలు పెట్టుకునే బయటకు కౌగిలించుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. మా పవన్ కి ఎవరూ సరిజోడు కారు అంటూ సైనికులు సోషల్ మీడియాగా ఇచ్చిన స్టేట్మెంట్స్ తమ్ముళ్లను ఎప్పటికీ మరచిపోలేవినే. అంతే కాదు సీఎం గా లోకేష్ కే చాన్స్ ఉంటుంది. ఎందుకంటే టీడీపీకే అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా తమ్ముళ్లు ఘాటుగా రియాక్ట్ కావడం చూసిన వారు అంతా కూడా టీడీపీ తమ్ముళ్లకు జనసేన మీద ఉన్న భావన ఇదేనా అని అనుకునే సీన్ ఉంది.

టీడీపీ హైకమాండ్ అలెర్ట్ తో వ్యవహారం తాత్కాలికంగా సద్దుమణిగి నట్లుగా అనిపించినా కూడా రెండు పార్టీల మధ్య ఏదో గ్యాప్ ఉందన్న బీజం అయితే పడింది. మరి దీనిని ఆయాచిత వరంగా మార్చుకుని ముందుకు సాగేందుకు వైసీపీ చూస్తుందా అన్నదే చర్చ. ఎందుకంటే టీడీపీ ఏమి చేయాలనుకుంటుందో వారి దృష్టిలో ఉప ముఖ్యమంత్రి ఎవరో బయటకు తేటతెల్లం అయ్యాక జనసేన ఇదివరకులా ఉండ లేదు అని అంటున్నారు.

అదే సమయంలో పవన్ సీఎం అని జనసైనికులు గట్టిగా మాట్లాడడం మొదలెట్టాక ఆ పార్టీ రాజకీయ లక్ష్యాలు ఏమిటో ఓపెన్ అయిపోయాక టీడీపీ కూడా రిలాక్స్ గా ఉంటుందని అనుకోవడానికి లేదు అని అంటున్నారు. అయితే పైన ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ పూర్తిగా పరిపక్వతతో ఆలోచిస్తారు కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం గ్యాప్ అన్నది ఉన్నది అర్ధం అవుతోంది అంటున్నారు.

ఈ గ్యాప్ ని ఎంత వరకూ పెంచి పోషించి తనకు అనుకూలంగా వైసీపీ మార్చుకుంటుంది అన్నదే చర్చగా ఉంది. మరి వైసీపీ రొట్టె విరిగి నేతిలో పడబోతోందా లేక ఆ రొట్టెని నేతిలో పడకుండా కూటమి చూసుకుంటోందా అన్నది తెలియాలీ అంటే రానున్న కాలమంతా వేచి చూడాల్సిందే అని అంటున్నారు. రాజకీయం అంటే ఇంతే. ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి వెయిట్ అండ్ సీ.