Begin typing your search above and press return to search.

ఇదే ప్రత్యేక కారణం.. తొలి అన్న క్యాంటీన్‌ అక్కడే!

అయితే.. 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లకు మంగళం పాడేశారు.

By:  Tupaki Desk   |   11 Jun 2024 2:43 PM GMT
ఇదే ప్రత్యేక కారణం.. తొలి అన్న క్యాంటీన్‌ అక్కడే!
X

ఆంధ్రప్రదేశ్‌ లో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్‌ పేరుతో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటిలో కేవలం రూ.5కే నాణ్యమైన ఆహారం అందేది. వీటికి పెద్ద ఎత్తున జనాలు క్యూ కట్టేవారు. ముఖ్యంగా నిరుపేదలు, కూలీలు, చిన్నాచితక పనులు చేసుకునేవారు, నిర్మాణ కార్మికుల నుంచి అన్న క్యాంటీన్లకు మంచి ఆదరణ లభించింది.

అయితే.. 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లకు మంగళం పాడేశారు. అంతేకాకుండా వాటిలో చాలావరకు కూల్చేశారు. కొన్నిటిని వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, తదితరాలకు కేటాయించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా జగన్‌ ప్రభుత్వం లక్ష్యపెట్టలేదు.

అయినప్పటికీ టీడీపీ నేతలు తమ సొంత ఖర్చులతో కొన్ని నియోజకవర్గాల్లో మొబైల్‌ వ్యాన్లలో అన్న క్యాంటీన్లను నడిపించారు. వాస్తవానికి తమిళనాడులో ఉన్న అమ్మ క్యాంటీన్లను స్ఫూర్తిగా తీసుకుని.. వీటిని ఆంధ్రప్రదేశ్‌ లో కూడా పెట్టారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను మూసేసింది.

ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. జనసేన పార్టీ సైతం టీడీపీతో పొత్తు పెట్టుకోకముందు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఇంకా ప్రభుత్వం ఏర్పడకముందే తొలి అన్న క్యాంటీన్‌ ప్రారంభమైపోయింది.

జూన్‌ 10న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా హిందూపురంలో అన్న క్యాంటీన్‌ ప్రారంభమైంది. కేవలం రూ.5 స్వల్ప ధరకే నాణ్యమైన ఆహారం అందుబాటులోకి వచ్చింది. దీంతో నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జూన్‌ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరికొంతమంది మంత్రులుగా బాధ్యతలు చేపడతారు. దీంతో మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.

అన్న క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే నిరుపేదలు, యాచకులు, వలస కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, చిరుద్యోగులు, తదితరులకు మేలు కలుగుతుందని భావిస్తున్నారు. కేవలం రూ.5కే నాణ్యమైన ఆహారం వీటిలో అందించనున్నారు.