ఏపీ తమిళనాడు అవుతుందా...తెలంగాణా అవుతుందా...?
అలా 2014లో టీడీపీ గెలిస్తే 2019లో వైసీపీ అధికారం అందుకుంది.
By: Tupaki Desk | 12 May 2024 2:30 AM GMTఏపీలో కొద్ది గంటలలో అతి పెద్ద పోలింగుకి తెర లేస్తోంది. ఈసారి కూడా ఓటర్లు తమ విలక్షణమైన తీర్పుని వెలువరించనున్నారు. అయితే ఈ తీర్పు ఎలా ఉంటుంది అన్నదే ఎడ తెగని చర్చగా ఉంది. ఏపీలో చూస్తే విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఒక పార్టీని పక్కన పెట్టి మరో పార్టీని ఎన్నుకున్నారు. అలా 2014లో టీడీపీ గెలిస్తే 2019లో వైసీపీ అధికారం అందుకుంది.
ఆనవాయితీ ప్రకారం ఈసారి చోటు టీడీపీకి దక్కాలని ఒక రకమైన రాజకీయ విశ్లేషణ. అయితే ఉన్నవి రెండు పార్టీలే అయినపుడు అందులో బాగుంది అనిపిస్తే పాస్ మార్కులు తెచ్చుకుంటే మరో చాన్స్ కూడా ఇచ్చే సీన్ దేశంలో చాలా చోట్ల ఉంది. మరీ ముఖ్యంగా పొరుగున ఉన్న తెలంగాణా లో అది జరిగింది. అక్కడ 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2018లో మరోసారి కూడా అధికారం అందుకుంది. అలా వరసగా గెలిచిన పార్టీగా రికార్డు సృష్టించింది.
అదే ఒరవడి ఏపీలో కూడా ఈసారి కొనసాగుతుందని తాము అందుకుంటామని వైసీపీ ధీమా పడుతోంది. అయితే తెలంగాణాలో జరిగిన ఎన్నికలు ఒక ప్రాంతీయ పార్టీతో రెండు జాతీయ పార్టీలకు మధ్యన. దాంతో అది అలా జరిగింది కానీ బలమైన రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోరాటం జరిగినపుడు ఒక్కో టెర్మ్ ఒక్కరికి మాత్రమే చాన్స్ అని తలపండిన మరో రకమైన రాజకీయ విశ్లేషణను ముందుకు తెస్తున్నారు.
దానికి ఉదాహరణగా తమిళనాడుని చూపిస్తున్నారు. అక్కడ డీఎంకే అన్నా డీఎంకే పార్టీలు పక్కా ప్రాంతీయ పార్టీలు బలమైనవి కూడా ఒక టెర్మ్ ఒకరికి చాన్స్ ఇస్తే మరోసారి ఇంకొకరికి చాన్స్ దక్కుతూ వస్తోంది. అయితే దానికి 2016లో జయలలిత బ్రేక్ చేశారు ఆమె 2011లో ఒకసారి గెలిచారు. అలాగే 2016లోనూ మరోసారి గెలిచారు. అలా రెండు సార్లు వరస విజయాలతో పాత్ర సంప్రదాయాన్ని ఆమె తోసి రాజన్నారు.
మరి అదే ఒరవడి ఏపీలో సాగుతుందా అంటే బలమైన నాయకత్వం ఉన్న చోట అలా జరగవచ్చు అన్నది ఇంకో రకం రాజకీయ విశ్లేషణ. ప్రజలకు ఒక మోస్తరు అసంతృప్తి ఉంటే కనుక ఆ పార్టీని నెగ్గించేస్తారు. కానీ మార్కులు తగ్గించి ఇస్తారు అన్నది ఉమండి ఏపీలో వైఎస్సార్ జమానాలో రుజువు అయింది. వైఎస్సార్ కావాలి రావాలి అన్న కాంక్షతో 2004లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కి మంచి మెజారిటీతో జనాలు పట్టం కట్టారు.
అదే 2009 నాటికి మాత్రం ఉన్నంతలో బెటర్ అనుకుంటూ పాస్ మార్కులతో మరోసారి అధికారం ఇచ్చారు ఆ టైంలో 156 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కి దక్కాయి. అప్పటి సీఎం వైఎస్సార్ కూడా తమ పార్టీకి బొటా బొటీ మార్కులే ఇచ్చారు అని మీడియా ముఖంగా చెప్పారు కూడా. మరి ఏపీలో ఏమి జరుగుతుందో ఏమో కానీ రకరకాలైన విశ్లేషణలు ఉన్నాయి. జనాలు మాత్రం గుంభనంగా ఉన్నారు.