బాబు ఆశ వర్కవుట్ అవుతుందా?
టీడీపీ సిద్ధాంతాలు నచ్చిన వారికి రెడ్ కార్పెట్ రెడీగా ఉంది' అంటూ.. చంద్రబాబు పిలుపునిస్తున్నారు.
By: Tupaki Desk | 30 Jan 2024 1:30 PM GMTరా.. రమ్మని! అన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు.. తాను నిర్వహిస్తున్న రా.. కదలిరా! సభల్లో గత రెండు రోజుల నుంచి ఓ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. `రాష్ట్రంలో సైకో పాలన సాగుతోంది. ఒక్క ప్రజలే కాదు.. వైసీపీ నాయకులు కూడా ఈ సైకోతో పడలేక పోతున్నారు. ఇలాంటి వారినినేను ఒకటే చెబుతున్నా. అక్కడ ఇమడలేని వారు వచ్చేయండి. రా.. కదలిరా! అంటూ పిలుపునిస్తున్నా. మీకు తగిన గౌరవం ఇక్కడ ఉంటుంది. వచ్చేయండి. టీడీపీ సిద్ధాంతాలు నచ్చిన వారికి రెడ్ కార్పెట్ రెడీగా ఉంది` అంటూ.. చంద్రబాబు పిలుపునిస్తున్నారు.
వాస్తవానికిఈ నెల మధ్య వరకు కూడా .. వైసీపీ నేతలను తీసుకునేది లేదని నారా లోకేష్ సహా చంద్రబాబు చెప్పారు. అంతేకా దు.. అక్కడి వారిని తీసుకుంటే.. మా కేడర్ ఏం కావాలని ప్రశ్నించారు. దీంతో వైసీపీ కూడా ధైర్యంగా మార్పులు చేర్పులు చేసేసింది. తాము ఔనన్నా.. కాదన్నా..ఇక్కడే ఉంటారని.. నాయకులపై అంచనా వేసింది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబు పిలుపునిస్తున్నారు. దీంతో ఎందరు వస్తారో.. రారో.. తెలియదు కానీ..(సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వచ్చేందుకు రెడీగా ఉన్నారని సమాచారం) చంద్రబాబు చేసిన ప్రకటన మాత్రం రాజకీయంగా చర్చకు దారితీసింది.
`రమ్మంటున్నారు.. వచ్చేస్తే.. ఏం చేస్తారు?` అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లే ఈ ప్రశ్నలు వేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ పరిస్తితి చూస్తే.. ఒక్కొక్క నియోజకవర్గానికీ ఎంతలేదన్నా.. ఇద్దరేసి ఉన్నారు. పోనీ.. ఒక్కరైనా ఖాయంగా పోటీకి రెడీ అంటున్నారు. వారు పార్టీకి విధేయులు కూడా. అలాంటి వారిని కాదని టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. పోనీ.. వచ్చే వారు ఉత్తచేతులతో రారు. ఏదైనా ఆశ చూపితే తప్ప.. వచ్చేందుకు సిద్ధంగా లేరు. ఇలాంటి సమయంలో చంద్రబాబు పిలుపు ఇవ్వడం ఎందుకనేది ప్రశ్న. అంతేకాదు.. ముందు మనవారిని చూడాలని కొందరు సూచనలు చేస్తున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. తమకు ఏం చేస్తారో.. అని నాయకులు అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో వారిలో భరోసా నింపేందుకు ప్రయత్నిస్తే.. టీడీపీ మరింత పుంజుకుంటుంది. అంతేతప్ప.. పొరుగు పార్టీ నుంచి నాయకులను ఆహ్వానించినంత మాత్రాన కొత్తరగడకు తెరదీయడమే తప్ప.. పార్టీకి ఒనగూరే ప్రత్యేక ప్రయోజనం ఏమీలేదని తమ్ముళ్లు చెబుతున్నారు. సో.. ఈ పరిణామాలను చంద్రబాబు గ్రహించాల్సిన అవసరం ఉందని.. లేనిపోని భారాన్ని తలకెత్తుకుంటే.. ఇబ్బందులు తప్పవని అంటున్నారు సీనియర్లు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.