అసలు ఏపీ బీజేపీలో ఏముందని!
ఏపీలో నాలుగున్నరేళ్ళుగా కమలనాథులు ఎంత ప్రయత్నాలు చేసినా ఒక్క నేత కూడా పార్టీలో చేరలేదు. 2019 ఎన్నికల తర్వాత నలుగురు టీడీపీ ఎంపీలు, కొందరు నేతలు బీజేపీలో చేరారు.
By: Tupaki Desk | 7 Jan 2024 4:30 PM GMTఏపీలో నాలుగున్నరేళ్ళుగా కమలనాథులు ఎంత ప్రయత్నాలు చేసినా ఒక్క నేత కూడా పార్టీలో చేరలేదు. 2019 ఎన్నికల తర్వాత నలుగురు టీడీపీ ఎంపీలు, కొందరు నేతలు బీజేపీలో చేరారు. ఈ చేరికలు ఎందుకు జరిగాయో అందరికీ తెలుసు. వీళ్ళుకాకుండా బీజేపీలో చేరిన తటస్తులంటు ఒక్కళ్ళు కూడా లేరు. కారణం ఏమిటంటే బీజేపీ అంటేనే జనాలు ఇంకా మండిపోతుండటమే. వైసీపీలో టికెట్లు దక్కని ఎంఎల్ఏలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారే కాని బీజేపీని మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. పైగా బీజేపీలో ఒకపుడు చేరికల కమిటీకి కన్వీనర్ ఇప్పటి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరే.
చేరికల విషయంలో బీజేపీ సక్సెస్ అవుతుందని ఎవరికీ ఆశలు లేవు. ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలు బీజేపీని పట్టించుకోని నేతలు ఎన్నికలకు ముందు మాత్రం ఎందుకు పట్టించుకుంటారు ? ఇపుడు విషయం ఏమిటంటే ఇతర పార్టీల్లోని అసంతృప్తులను, తటస్థులను బీజేపీలో చేర్చుకోవాలని కమలనాథులు గట్టిగా నిర్ణయించుకున్నారు. కమలనాథులు నిర్ణయించుకోవటం కాదు నిర్ణయించుకోవాల్సింది నేతలు, తటస్థులు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ ఎంత తప్పుచేసిందో బీజేపీ కూడా అంతే తప్పుచేసింది.
అడ్డుగోలు రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, రెండు పార్టీలు పెద్ద తప్పేచేశాయి. అందుకనే రెండు పార్టీలు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. 2014 తర్వాత రెండు పార్టీలకు జనాలు పెద్దగా ఓట్లేయటంలేదు. కాకపోతే టీడీపీ, జనసేనతో పొత్తు కారణంగా 2014లో నాలుగు ఎంఎల్ఏ సీట్లలో బీజేపీ గెలిచింది. 2019లో ఒంటరిగా పోటీ చేసిన తర్వాత పార్టీ పరిస్ధితి ఏమిటో అందరికీ తెలిసింది. అలాంటిది ఇపుడు సడెన్ గా నేతలను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటే చేరటానికి నేతలు సిద్ధంగా ఉండాలి కదా.
చేరికల కమిటి చాలామంది తటస్థులను కలిసి పార్టీలోకి రమ్మని ఆహ్వానించినా ఎవరు ఇష్టపడలేదు. ఇతర పార్టీల్లోని నేతలకు గేట్లెత్తినా ఎత్తిన గేట్లు అలాగే ఉండిపోయాయి. అలాంటిది సరిగ్గా ఎన్నికలకు ముందు ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించాలంటే ఎలా సాధ్యమవుతుంది ? అసలు ఏపీ బీజేపీలో ఏముందని ఇతర పార్టీల నేతలు చేరాలో అర్ధం కావటంలేదు. ఎన్నికల్లో టికెటిచ్చి, భారీగా డబ్బులు కూడా ఇస్తారని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రం చేరాలంతే.