బీజేపీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
ఈ విషయాలను తేల్చుకునేందుకు తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పవన్ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో 40 నిముషాలు భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 26 Oct 2023 6:12 AM GMTతెలంగాణా ఎన్నికలకు సంబంధించి జనసేనతో పొత్తులో బీజేపీదే పైచేయి అయ్యింది. కమలం పార్టీతో పొత్తు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలా మెట్లు దిగేశారు. సైకలాజికల్ గా పవన్ను ఒత్తిడిలోకి నెట్టేసిన బీజేపీ నేతలు పొత్తులో తాము అనుకున్నట్లే వ్యవహరించగలుగుతున్న విషయం అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఫైనల్ అయిపోయింది. అయితే ఎవరు ఎన్నిసీట్లకు పోటీచేస్తారు ? ఏ సీట్లలో పోటీచేస్తారన్నదే తేలలేదు.
ఈ విషయాలను తేల్చుకునేందుకు తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పవన్ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో 40 నిముషాలు భేటీ అయ్యారు. అయితే ఈ విషయమై అమిత్ షా కొన్ని సూచనలు చేసి మిగిలిన విషయాలను హైదరాబాద్ లోనే తేల్చుకోమని చెప్పి పంపేశారు. దాంతో ఇద్దరు ఢిల్లీకి వెళ్ళినంత స్పీడుగా తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆమధ్య తెలంగాణాలో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని పవన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.
అభ్యర్ధులను ప్రకటించలేదుకానీ నియోజకవర్గాలను పవన్ ప్రకటించేశారు. తాజా పరిణామాల్లో 20 సీట్లు జనసేనకు కేటాయించాలని పవన్ అడుగుతున్నారు. అంటే 32 నియోజకవర్గాల నుండి 20 నియోజకవర్గాలకు పవన్ తగ్గిపోయారు. అయితే 20 నియోజకవర్గాలను కాకుండా బీజేపీ 10 సీట్లు ఇచ్చే అవకాశముందని కమలంపార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలైతే 8 సీట్లు మాత్రమే ఇవ్వాలని ముందు అనుకున్నా తర్వాత దాన్ని పదికి పెంచిందట. ఇక్కడే పొత్తుల విషయంలో పవన్ ఎన్ని మెట్లు దిగిపోయారో అర్ధమవుతోంది. ఎందుకు దిగారంటే బీజేపీతో బేరమాడే పరిస్ధితి పవన్ కు లేదు కాబట్టే.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏపీలోనే బీజేపీ కౌగిలి నుండి బయటపడదామని పవన్ ప్రయత్నిస్తున్నారు. అలాంటిది మళ్ళీ తెలంగాణాలో కూడా పొత్తు పెట్టుకున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది. తాజా పరిణామాలతో బీజేపీ-పవన్ మధ్య ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఏదేమైనా పవన్ను తమతోనే అట్టిపెట్టుకోవటంలో బీజేపీ సక్సెస్ సాధించిందనే అనుకోవాలి. మరిది తెలంగాణాకు మాత్రమే పరిమితమా ? లేకపోతే ఏపీలో కూడా ఇదే సీనుంటుందా అన్నదే సస్పెన్సుగా మారింది.