రేవంత్ చేసింది చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు ?
ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోటిగా చేసుకుంటూ పోతున్నారు.
By: Tupaki Desk | 17 Jun 2024 4:08 AM GMTతెలంగాణా ముఖ్యమంత్రి అధికార అనుభవం ఆరు నెలలు మాత్రమే ఆయన తనదైన శైలిలో పాలన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో నెగ్గాలో తెలుసుకుని ఆయన తనదైన ఒరవడితో సాగుతున్నారు. ఆయన పట్టుదలగా కొన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోటిగా చేసుకుంటూ పోతున్నారు.
అందులో అతి ముఖ్యమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ. రేవంత్ ఇలా సీఎం గా చార్జ్ తీసుకున్నారు. అలా ఈ హామీని నెరవేర్చారు. గత ఆరు నెలలుగా ఇది తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా అమలు అవుతోంది. దీని వల్ల మహిళలు అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. హైదరాబాద్ లాంటి మహా నగరంలో తల్లి పచ్చడి చేసి మరో మూలన ఉన్న తన బిడ్డకు పట్టుకుని వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉంది అంటే ఆశ్చర్యమే కదా.
ఎంతలా దూరాలను దగ్గర చేసి బంధాలను కలిపేసిన స్కీం గా దీన్ని తల్లులూ బిడ్డలూ తెగ పొగుడుతున్నారు. ఇక సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తొలి వారంలోనే ఈ పధకం అమలు చేయడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చారు అని అంటున్నారు. అలా కనుక చూసుకుంటే రేవంత్ రెడ్డి కేవలం వంద రోజుల్లోనే మూడు పధకాలు అమలు చేసి చూపించారు అని కూడా గుర్తు చేస్తున్నారు.
ఇక చంద్రబాబు సీఎం అయ్యాక చేసిన మొదటి అయిదు సంతకాలూ చూస్తే పెద్దగా బడ్జెట్ తో సంబంధం లేని విధంగానే ఉన్నాయి. అలా భారీ సంక్షేమ పధకాలు ఏవీ ఇందులో లేకపోవడం కూడా అంతా చూస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నది బడ్జెట్ తో ఏ మాత్రం సంబంధం లేని పాలనాపరమైన వ్యవహారంగానే చూడాలి. ఇది విధానపరమైన నిర్ణయం. దీని మీద బాబు సంతకం చేశారు.
అలాగే మిగిలినవి కూడా వెంటనే బడ్జెట్ నుంచి ఖర్చు చేయాల్సిన విషయాలు అయితే కావు అనే అంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు మహిళలకు పధకాలు ఎపుడు అమలు చేస్తారు అన్నది అందరిలోనూ ప్రశ్నగా ఉంది. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, అదే విధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం అలాగే 18 ఏళ్ళు దాటిన ప్రతీ మహిళ ఖాతాలో నెలకు 1500 రూపాయలు వేయడం, తల్లికి వందనం కింది విద్యా సంవత్సరం మొదలైన వేళ నిధులు జమ చేయడం ఇలాంటి ఆకర్షణీయమైన పధకాల మీదనే అందరి దృష్టీ ఉంది అని అంటున్నారు.
వీటిలో అర్జంటుగా చేయగలిగేవి ఉచిత బస్సు సదుపాయం అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ అని అంటున్నారు. వీటి మీద బాబు సంతకాలు పెట్టి అమలు చేసి ఉంటే బాగుండేది అని అంటున్నారు. ఒక వైపు తెలంగాణాలో రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ స్కీం ని అమలు చేసి చూపిస్తున్నారు. మరి చంద్రబాబు ఎందుకు మీనమేషాలు లెక్కబెడుతున్నారు అని అంటున్నారు. రేవంత్ చేసినది బాబు చేయలేరా అని కూడా అంటున్న వారూ ఉన్నారు.
ఇపుడే ఏముంది ప్రజలు అయిదేళ్ల పాటు అధికారం ఇచ్చారు అని చంద్రబాబు అనుకుంటే మాత్రం అది పొరపాటే అవుతుందని అంటున్నారు. ఎందుకు అంటే కేంద్రంలో అతుకుల బొంత మాదిరి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నిబద్ధతో మద్దతు ఇచ్చినా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎపుడు అనుకుంటే అపుడు ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటున్నారు.
ఇక చూస్తే వచ్చే ఏడాది బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. నితీష్ కుమార్ తన రాష్ట్రంలో ఎన్నికలు రాజకీయాలు చూసుకుని మోడీకి బై చెప్తే అపుడు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పడిపోయే ప్రమాదం అయితే పొంచి ఉంది అని అంటున్నారు. ఇక అపుడు మధ్యంతర ఎన్నికలు వస్తే టీడీపీ తన హామీలను ఏమీ చేయలేకపోతే సీట్లు తగ్గిపోతాయని అంటున్నారు.
ఆ నేపధ్యం గురించి ఆలోచించినపుడు మళ్ళీ కేంద్రంలో మోడీ రాకపోతే అపుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం కూడా ఎంతో కష్టమవుతుంది అన్నది ఒక కఠినమైన రాజకీయ విశ్లేషణగా ఉందీని అంటున్నారు. నిజంగా చూస్తే ఇలాంటి పరిస్థితి కేంద్రంలో ఉంది. మోడీ మూడోసారి ప్రధాని కావాలి అన్న రికార్డు కోసం అందరినీ దగ్గర పెట్టుకున్నారు కానీ బీజేపీ సైతం అయిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపదు అని అంటున్నారు.
తనకు ఏమైనా అనుకూల పరిస్థితి ఉంది అనుకుంటే కేంద్రమే మధ్యంతర ఎన్నికలకు వెళ్ళినా వెళ్తుంది అని కూడా జాతీయ స్థాయిలో వినిపిస్తున్న మాట. ఎలా చూసుకున్నా గట్టా రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి ఎంపీ ఎన్నికలు జరగనున్నాయని అంటున్నారు. ఈ లోగానే ఏపీ ప్రభుత్వం తన హామీలు తీర్చాలి. అన్నీ చక్కబెట్టుకోవాలి టైం చూస్తే చాలా స్వల్పం అని కూడా తలపండిన వారు చేస్తున్న హెచ్చరికగా ఉంది.