హర్యానా 'హస్త' గతమయ్యేనా ?!
గత రెండు విడతలుగా బీజేపీ ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంటుండడమే కాకుండా పదికి పది ఎంపీ స్థానాలను గెలుచుకుంటూ వస్తుంది.
By: Tupaki Desk | 26 July 2024 1:30 PM GMTరాజకీయాల్లో ఆయారాం .. గయారాం పదానికి అంకురార్పణ చేసిన హర్యాన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఏడాది నవంబరులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉన్న తరుణంలో అక్టోబరు నెలాఖరుకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. గత రెండు విడతలుగా బీజేపీ ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంటుండడమే కాకుండా పదికి పది ఎంపీ స్థానాలను గెలుచుకుంటూ వస్తుంది.
ప్రస్తుతం ఇక్కడి శాసనసభలో 90 స్థానాలకు గాను బీజేపీకి ఒక ఇండిపెండెంట్, మరొక మిత్రపక్ష ఎమ్మెల్యేతో కలిసి 43 మంది శాసనసభ్యులున్నారు. కాంగ్రెస్ పార్టీకి 29 మంది సభ్యుల బలం ఉండగా, ముగ్గురు మిత్రపక్ష ఎమ్మెల్యేల బలంతో 32 మంది సభ్యులున్నారు. అయితే ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యానికి గండి కొడుతూ 10 ఎంపీ స్థానాలలో ఐదు కాంగ్రెస్ చేజిక్కించుకున్నది. అంబాలా, సిర్సా, హిసార్, సోనీపట్, రోహ్ తక్ స్థానాలలో విజయం సాధించింది. కురుక్షేత్ర, కర్నాల్, భివానీ, గుర్గావ్, ఫరీదాబాద్ లలో బీజేపీ గెలిచింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ మీద రెండు సార్లు పాలించిన ప్రజా వ్యతిరేకత మూలంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదృష్టం కలిసివస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఆప్ సొంతంగా పోటీ చేస్తే ఫలితాలు బీజేపీకి కలిసి వస్తాయేమోనన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇక్కడ ఆప్ గెలిచేంత పరిస్థితి లేకున్నా .. పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
హర్యానాలో ప్రస్తుతం యువత, రైతులు సానుకూలంగా ఉండటం, దళిత -జాట్ సామాజిక వర్గాల్లో మద్దతు పెరగటం కాంగ్రెస్ పార్టీకి అనుకూలిస్తున్నది. 90 శాసనసభ స్థానాలు ఉన్న హర్యానాలో ఈ ఎన్నికల్లో 43 నుండి 48 కాంగ్రెస్ కూటమి, 34 నుండి 39 స్థానాలు బీజేపీ కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్, ట్రాక్టర్ పోల్ వంటి సర్వేలలో వెల్లడయింది. హర్యానాలో నాలుగో వంతు జనాభా జాట్లే కావడం, ఈ ఎన్నికల్లో వారి మద్దతు కాంగ్రెస్ దక్కించుకోవడం లాభం చేకూరుస్తుందని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరి బీజేపీ నిలబెట్టుకుంటుందా ? కాంగ్రెస్ దక్కించుకుంటుందా ? వేచిచూడాలి.