Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్ డిసైడ్ చేసేస్తాయా ?

ఇక అసలైన పాయింట్ కి వస్తే ఏపీలో ఎపుడూ కాస్ట్ పాలిటిక్స్ తోనే కధ నడిచింది.

By:  Tupaki Desk   |   31 May 2024 2:45 AM GMT
ఎగ్జిట్ పోల్స్ డిసైడ్ చేసేస్తాయా ?
X

ఏపీలో ఎన్నడూ లేని విధంగా పోరు సాగింది. ఎవరు ఎవరికి ఓటు వేశారో అంతా గుంభనంగానే సాగింది. ఇది 2024 ఎన్నికలలో కనిపించిన మార్పుగా చెప్పాలి. ఓకల్ సెక్షన్ అయితే బాహాటంగా తాము ఎవరికి ఓటు వేసిందో చెప్పేసింది. అయితే అందులో కూడా సైలెంట్ సెక్షన్ ఒకటి ఉంది. వారు పూర్తిగా మౌన ముద్రలో ఉన్నారు. వారి ఓటు ఎటు వెళ్ళింది అన్నది తెలియదు.

ఇక అసలైన పాయింట్ కి వస్తే ఏపీలో ఎపుడూ కాస్ట్ పాలిటిక్స్ తోనే కధ నడిచింది. ఈసారి క్యాష్ పాలిటిక్స్ కూడా ఎంట్రీ ఇచ్చాయి. క్యాష్ అంటే ఎన్నికల్లో పంచే నగదు అని కాదు. సంక్షేమ పధకాలు అన్నదే అసలు విషయం.

అవి నేరుగా లబ్దిదారుని ఖాతాలోకి వెళ్ళిన మొత్తాలు. అలా అయిదేళ్ల పాటు ప్రతీ అకౌంట్ లోకి వెళ్ళిన మొత్తాలు చూస్తే లక్షల్లోనే ఉన్నాయి. మరి ఆ క్యాష్ పాలిటిక్స్ ఏపీ ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపించింది అన్నదే కీలకమైన పాయింట్.

అంతే కాదు సంక్షేమం గురించి టీడీపీ వైసీపీ రెండూ జనాలలో ప్రచారం చేశాయి. ఒకరు ఇచ్చిన దాని కంటే మరొకరు ఎక్కువ ఇస్తామని చెబుతూ వచ్చారు. మరి ఈ క్యాష్ పాలిటిక్స్ ఏమైనా క్యాస్ట్ ని పక్కన పెట్టి గెలిచిందా అన్నది కూడా ముఖ్యమైన అంశం. ఇంకో వైపు చూస్తే చాలా నియోజకవర్గాల్లో వందా రెండు వందల తేడాతో ఫలితం నిర్ధారణ అవుతుంది అని అంటున్నారు.

అలాంటి సమయంలో పోస్టల్ బ్యాలెట్ వజ్రాయుధం గా మారి ఆ గెలుపోటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా మారుతుంది అని అంటున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటున రెండు వేల నుంచి మూడు వేల దాకా పోస్టల్ ఓట్లు పోల్ అయ్యాయని అంటున్నారు. ఇందులో ఏ పార్టీకి మెజారిటీ ఓట్లు లభిస్తే ఆ పార్టీ అభ్యర్ధి గెలుపు ఖాయం. అలా ఈవీఎంలలో వచ్చిన ఓట్లలో స్వల్ప ఆధిక్యత వచ్చిన అభ్యర్ధిని పక్కన పెట్టి మరీ పోస్టల్ ఓట్లు వెల్లువలా మరో పార్టీకి వస్తే అపుడు విజేత కూడా మారిపోతారు.

ఈసారి ఎన్నికల్లో ఇదే అతి ముఖ్యమైన పాయింట్ గా ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చేసిన వారు కేవలం ఈవీఎంలలో పడిన ఓట్లను లెక్క వేసి ఫలానా వారికి ఇన్ని సీట్లు అని ఇచ్చేస్తున్నారు. కానీ ఆ ఓట్లను కూడా తారు మారు చేసేలా పోస్టల్ ఓట్లు ఉన్న సంగతి అవి ఎవరికి ఎక్కువ పడ్డాయన్నది ఎగ్జిట్ పోల్స్ లో చచ్చినా తేలదు, అది తేలేది ఎగ్జాక్ట్ పోల్ లోనే.

దానిని బట్టి చూస్తే కనుక జూన్ 1న విడుదల అయ్యే ఎగ్జిట్ పోల్స్ ని ఎంతవరకూ నమ్మ వచ్చు అన్న కొత్త చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా జూన్ 4న వచ్చే ఫలితాలే అసలైన ఫలితాలు అని అంతా అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో కొంత వరకూ జనాల మూడ్ తెలిసే అవకాశం ఉంది కానీ ఎవరికి ఎన్ని సీట్లు ఎవరికి అధికారం అన్నది మాత్రం కన్ ఫర్మ్ కాదు అనే అంటున్నారు. అయితే ఒక బలమైన వేవ్ సైలెంట్ గా వీస్తే మాత్రం అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాదు కదా ఏ ఓటూ కూడా ఏ పార్టీని రక్షించలేదు అన్న మాట కూడా ఉంది. మరి ఆ సైలెంట్ ఓటింగ్ జరిగినా భారీ విజయాలు ఈసారి కూడా ఏకపక్షంగా ఒకే పార్టీకి దక్కుతాయా అంటే వెయిట్ అండ్ సీ.