గంటాకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందా ?
అయితే గంటా మాత్రం గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తున్నారు.
By: Tupaki Desk | 22 July 2024 3:38 AM GMTమాజీ మంత్రి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత గంటా శ్రీనివాసరావు గత కొంతకాలంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. కచ్చితంగా మంత్రి అవుతారు అని అంతా అనుకుంటే ఆయనను జస్ట్ ఎమ్మెల్యేగానే బాబు ఉంచేశారు. దాంతో ఆయనతో పాటు అనుచరులు అభిమానులు నిరాశ చెందారు. అయితే గంటా మాత్రం గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తున్నారు.
ఆయన విశాఖ జిల్లాలో టీడీపీని మరింతగా బలోపేతం చేసే పనిలో పడ్డారు మాజీ ఎమ్మెల్యేలను వైసీపీ సీనియర్ నేతలను టీడీపీ గూటికి చేర్పించే పనిలో గంటా బిజీగా ఉన్నారు. ఇక విశాఖ మేయర్ పీఠం టీడీపీకి దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా అందడం లేదు. ఎపుడో 1987లో ఒక ఒకసారి టీడీపీ విశాఖ మేయర్ పీఠం మీద కూర్చుంది. ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ మూడు సార్లు గెలిస్తే వైసీపీ ఒకసారి గెలిచింది. దీంతో టీడీపీకి మేయర్ పీఠం ఒక కలగా మారుతోంది.
దానిని గంటా తన వ్యూహంతో సాకారం చేస్తున్నారు. విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పారు. దాంతో పద్నాలుగు మంది వైసీపీ కార్పోరేటర్లు టీడీపీ కూటమి వైపుగా వచ్చారు. వారందరికీ తగిన భరోసా ఇచ్చి మరీ ఈ వైపునకు తెచ్చారు. టీడీపీ జెండాను అలా విశాఖ కార్పొరేషన్ మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకనాడు గంటా ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్ లో మొత్తానికి మొత్తం కార్పోరేటర్లు వైసీపీ పరం అయ్యాయని గంటా పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని సొంత పార్టీలో విమర్శలు వినిపించాయి. అయితే ఇపుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో గంటా చక్రం తిప్పి అదే ఉత్తర నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్పోరేటర్లను టీడీపీ వైపుగా లాగేశారు. తొందరలో విశాఖ మేయర్ గా టీడీపీ నేతను చూడబోతున్నారు కూడా.
ఇక తరువాత స్టెప్ లో ఆయన వైసీపీలో ఉన్న బలమైన నేతలను లాగేసి టీడీపీని ఇంకా బలోపేతం చేసే పనిలో ఉన్నారు. అలాగే చంద్రబాబు పాలన గురించి ప్రెస్ మీట్లు పెడుతూ మెచ్చుకుంటున్నారు. జగన్ ని వైసీపీని తెగనాడుతూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
విశాఖ సిటీలో టీడీపీకి మంత్రి లేరు. అయినా సరే రాజకీయంగా ముందుంటూ గంటా పావులు కదుపుతున్నారు. దాంతో గంటా పడుతున్న ఈ శ్రమకు తగిన రిటర్న్ గిఫ్ట్ ని అధినాయకత్వం ఇస్తుందా అన్న చర్చ సాగుతోంది. టీడీపీలో ఓసీ కాపులకు పెద్దగా మంత్రి పదవులు దక్కలేదు.ఉత్తరాంధ్రాలో అయితే ఒక్కరికీ ఇవ్వలేదు. ఆ సామాజిక సమీకరణలను సరి చేస్తే మాత్రం గంటాకు మినిస్టర్ బెర్త్ ఖాయమని అంటున్నారు.
ఏపీలో మెగా సిటీగా ఉన్న విశాఖలో గంటా లాంటి వారికి మంత్రి పదవి ఇస్తే అటు పార్టీ ఇటు ప్రభుత్వం గాడిన పడతాయని కూడా ఆయన వర్గం అంటోంది.మొత్తానికి గంటా అటు వైపు నుంచి నరుక్కు వస్తున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.