Begin typing your search above and press return to search.

వీళ్ల‌ను వ‌దిలించుకుంటేనే జ‌గ‌న్ సేఫ్‌..!

ఇద వ్యక్తిగతంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కీల‌క వ్య‌వ‌హారం.

By:  Tupaki Desk   |   15 July 2024 2:15 AM GMT
వీళ్ల‌ను వ‌దిలించుకుంటేనే జ‌గ‌న్ సేఫ్‌..!
X

ఒక మార్పు లేదా ఒక తీర్పు నాయకులను మార్చాలి. పార్టీని కూడా మార్చాలి. 151 స్థానాలతో 2019లో ఘన విజయం దక్కించుకొని దేశం మొత్తం నివ్వరపోయేలా చేసిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 11 స్థానాలతో దేశం మొత్తం అంతే ఆశ్చ‌ర్య‌పోయేలాగా చేశారు. ఈ ఓటమి అనేక కారణాలతో సంభవించిందని ఆయన ఇప్పటికీ విశ్వసిస్తున్నారా? లేదా? అనేది పెద్ద క్వశ్చన్ మార్కుగా మిగిలిపోయింది. దీనికి కారణం ఎవరైతే నాయకుల కారణంగా పార్టీకి- ప్రజలకు మధ్య దూరం పెరిగిపోయిందో.. ఏ నాయకుల కారణంగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ తగ్గిపోయిందో.. ఏ నాయకుల నోటి దురుసు కారణంగా పార్టీ ప్రజలకు దూరం అయిపోయిందో.. విపక్షాల విమర్శలకు కారణమైందో ఆ నాయకులను పట్టుకునే జగన్మోహన్ రెడ్డి ఇంకా వేలాడుతున్నారు.

ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద చర్చగా మారింది. ఇద వ్యక్తిగతంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కీల‌క వ్య‌వ‌హారం. ఆయన ఇలానే ఉంటే.. పార్టీ కూడా ఇలానే ఉంటే.. రాబోయే రోజుల్లో ప్రజలు తీర్పు మరింత దారుణంగా ఉన్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో `నా ఇష్టం.. నా పార్టీ.. నా నాయకులు`` అని వ్యాఖ్యానించిన అప్పటి ముఖ్యమంత్రి మాయావతి వ్యవహార శైలి ఆ రాష్ట్రంలో ఏం చేసిందో అందరికీ తెలిసిందే. ధూమ్ ధామ్ గా ప్రభుత్వాన్ని నిర్వహించిన మాయావతి త‌ర్వాత కాలంలో చ‌తికిల ప‌డ్డారు.

ఎక్కడికక్కడ నాయకుల దూకుడు. నాయకుల మొండి వైఖరి. నోటి దురుసు, విపక్షాలను బెదిరించటం వంటి కార‌ణంగా అధికారంలో ఉన్న స‌మ‌యంలో మాయావతి పార్టీ బీఎస్పీ అనేక నింద‌లు పడింది. అనేక విమర్శలు ఎదుర్కొంది. వాటి నుంచి కోలుకోవాలని, వాటి నుంచి నేర్చుకోవాలని అనేక సూచనలు వచ్చాయి. కానీ మాయావతి ఒక్క మాట కూడా పట్టించుకోలేదు. ఫలితంగా ఏ అధికారంలో అయితే ఉన్నారో... తర్వాత కాలంలో కేవలం కేవలం నాలుగు అంటే నాలుగు స్థానాలకు ఆమె పార్టీ కుప్పకూలిపోయిన విషయం దేశ చరిత్రలో మొదటిసారి.

ఆ తర్వాత ఇదే పరిస్థితిని వైసీపీ ఈనాడు ఎదుర్కొంది. దీనికంటే ముందు కరుణానిధి ప్రభుత్వం కూడా ఉండొచ్చు. కానీ ఆ తర్వాత వాళ్ళు తప్పులు తెలుసుకున్నారు. ఏది చేస్తే ప్రజలకు దూరమయ్యారు? ఎవరిని ఆదరిస్తే ప్ర‌జలు హర్షించలేదో తెలుసుకొని కరుణానిధి, మాయావతి వంటి వారు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తద్వారా కరుణానిధి అధికారంలోకి వస్తే మాయావతి తర్వాత కాలంలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు. ఇలాంటి పాఠాలు దేశంలో అనేకం ఉన్నాయి. మరి వాటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం నేర్చుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న.

ప్రస్తుత పరిణామాలను చూస్తే రాష్ట్రంలో గడిచిన నెలరోజుల కాలంలో అనేక ఘటనలు సంభవించాయి. నాలుగు చోట్ల అత్యాచారాలు జరిగి మహిళలపై హత్యలు కూడా జరిగాయి. వాళ్లను వెళ్లి పరామర్శించి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కొంత పెరిగి ఉండేది. కానీ ఆయన తన తొలి పర్యటనను నెల్లూరు జిల్లా జైలుకు పెట్టుకోవడం.. అదికూడా ఈవీఎంలను ధ్వంసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడం ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? అనేది స్పష్టమవుతుంది. అలాగే పార్టీలో నోటి దూలతో వ్యవహరించిన నాయకుల కారణంగా ప్రజలకు పార్టీ దూరమైంది.

ముఖ్యంగా మేధావులకు తటస్థ ఓట‌ర్ల‌కు కూడా పార్టీ దూరమైంది. ఫలితం గానే 10% ఓటు బ్యాంకు కోల్పోయి 11 స్థానాలకు వైసీపీ పరిమితమైంది. అయినా జగన్ మోహన్ రెడ్డిలో మార్పు కనిపించడం లేదు. కొడాలి నాని, జోగి రమేష్ అదేవిధంగా అంబటి రాంబాబు ఇట్లాంటి నాయకులను ఆయన దూరం పెట్టకపోగా వారికే అధికారాలు ఇచ్చినట్టుగా.. వారితోనే మాట్లాడిస్తున్నారు. వారికే మద్దతు ఇస్తున్నట్టుగా సంకేతాలు పంపించడం చూస్తుంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి . జగన్ మారకపోగా పార్టీలో నాయకులను సైతం మార్చ‌క పోగా.. ప్రజల మధ్యకు ఏ విధంగా వెళ్లాలని అనుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న.

తను మారి పార్టీని మార్చుకున్న కారణంగానే చంద్రబాబు నాయుడు ఈసారి 134 స్థానాల్లో విజయం దక్కించుకున్నారు. ఇదేమీ చిన్న విషయం కాదు. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ లోపాలు అయితే ఉన్నాయని సమాజం కోడైకూస్తోందో.. ఆ లోపాలను ఆయన గుర్తించాలి. కేవలం ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని ఆరోజు సమర్ధించుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అధికార పార్టీ నుంచి దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. తప్ప తనంతాను మార్చుకునే దిశగా తన నాయకులను మార్చే దిశగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అడుగులు వేయకపోవడం పార్టీని, ఆయన పనితనాన్ని క‌ళ్ల‌కు క‌డుతున్నాయి.

ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. మార్పు అనేది వ్యక్తి నుంచి మొదలైతే వ్యవస్థకు పాకుతుంది. కానీ వ్యవస్థ ద్వేషించిన తర్వాత వ్యక్తి మారినా సమాజం పట్టించుకోదనే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమయం మించిపోతే రేపు.. ఉన్న కాస్త ఇమేజ్ కూడా పోతే.. అప్పుడు చేతులు ఎత్తేసినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఓటు బ్యాంకు 40% వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి అదే ఓటు బ్యాంకు చీల్చేందుకు షర్మిల రూపంలో ప్రత్యర్థులు పొంచి ఉన్నారన్న నిజం ఎందుకు కనిపించడం లేదు?

ష‌ర్మిలను తక్కువ అంచనా వేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. ఆమె కారణంగానే ఓడిపోయారన్న నిజాన్ని మాత్రం గ్రహించారా? గ్రహించలేదా? అనేదాన్ని ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు వచ్చే రెండు మూడు మాసాలలో అయినా పార్టీలో వ్యవస్థను మార్చేలా.. ప్రజలకు చేరువయ్యేలా.. సౌమ్యులకు. విజ్ఞానులకు పార్టీలో కీల‌క ప‌దువులు అప్పగించడం ద్వారా ఆయన మార్పును చూపించగలగాలి. లేక‌పోతే.. ఇక ఇంత‌టితో స‌రి!!