లైన్ కలిసింది : కాంగ్రెస్ తో జేడీ జత కడతారా...!?
దాంతో ఆయన ఇపుడు తనకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీలతో కలసి ఈ అంశాల మీద పోరాటమే కాదు ఎన్నికలలో కూడా కలసి పోటీ చేస్తారా అన్న చర్చ నడుస్తోంది
By: Tupaki Desk | 31 Jan 2024 4:00 AM GMTజై భారత్ పార్టీ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఒక పార్టీని స్థాపించారు. ఆ పార్టీ విధి విధానాలను ఆయన ప్రకటిస్తూ అందులో హైలెట్ గా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. అలాగే విభజన హామీల గురించి కూడా ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జేడీ ఆది నుంచి వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు.
దాంతో ఆయన ఇపుడు తనకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీలతో కలసి ఈ అంశాల మీద పోరాటమే కాదు ఎన్నికలలో కూడా కలసి పోటీ చేస్తారా అన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంశం మీద విశాఖలో ఆందోళన చేస్తే అందులో జేడీ పాల్గొన్నారు. ఆయన కూడా ఏపీకి హోదా కావాల్సిందే అని నినదించారు.
అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని అన్యాయంగా ప్రైవేట్ పరం చేస్తోందని కూడా జేడీ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇపుడు వైఎస్ షర్మిల నాయకత్వంలోని ఏపీ కాంగ్రెస్ ఇవే అంశాలను తీసుకుని జనంలోకి వెళ్తోంది. షర్మిల ఏపీలో కాంగ్రెస్ ని బలోపేతం చేసే దిశగా యాక్షన్ ప్లాన్ తో సాగుతున్నారు.
ముందుగా కాంగ్రెస్ ని పటిష్టం చేసే పనిలో ఆమె ఉన్నారు. ఆ మీదట పొత్తులు కూడా ఉంటాయని అంటున్నారు. ఇక జేడీ కూడా మొత్తం అన్ని సీట్లకు జై భారత్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పినా కూడా ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అన్నది తధ్యం. ఇతర సీట్లలో కూడా ఆయన పార్టీ నుంచి యువతకు సీట్లు ఇస్తామని చెబుతున్నారు. అయితే ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ ఎవరు ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నది తెలియడంలేదు.
ఈ నేపధ్యంలో జేడీ కూడా ఒక కూటమితో కలసి ఎన్నికలలో పోటీకి సిద్ధపడతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన విధానాలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇపుడు ఏపీలో ఉంది. ఆయన సొంతంగా పార్టీ పెట్టారు కాబట్టి కాంగ్రెస్ లో చేరకపోయినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అలాగే జేడీ వంటి మేధావులతో కలసి పనిచేయడం కాంగ్రెస్ కి కూడా ఎంతో కొంత మేలు కలగచేసేది గానే ఉంటుంది అని అంటున్నారు. కాంగ్రెస్ నిబద్ధత కాంగ్రెస్ గొంతుక మరింతగా జనంలోకి వెళ్ళి ఆలోచనలు పెంచుతాయని అంటున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కనుక పొత్తులో ఉంటే వామపక్షాలు కూడా ఈ కూటమిలోకి రావచ్చు అని అంటున్నారు.
అలాగే ఏపీలో బీఎస్పీ, ఆప్ వంటి పార్టీలతో పాటు అనేక ఇతర పార్టీలు అన్నీ కలసి మాత్రం ఒక్కటిగా ముందుకు వచ్చే అవకాశాలను ఎవరూ కొట్టి పారేయడంలేదు. మొత్తానికి చూస్తే ఏపీలో మరో కూటమి కూడా పురుడు పోసుకునే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయనే అంటున్నారు. అపుడు ఏపీలో ఓట్ల చీలిక కూడా జరగడం ఖాయమని అంటున్నారు. అది ఏ ప్రధాన పక్షానికి మేలు చేసుకుంది. లేకా కీడు చేస్తుంది అన్నది ఎన్నికల ఫలితాలే చెప్పాలి.