Begin typing your search above and press return to search.

మోడీ షాలకు భారీ షాక్ ఇవ్వనున్న జగన్ ?

చేరిన తరువాత టీడీపీలో ఉంటూ బీజేపీలోకి జంప్ చేసిన నేతలకే ఎక్కువగా సీట్లు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   29 May 2024 1:30 AM GMT
మోడీ షాలకు భారీ షాక్ ఇవ్వనున్న జగన్ ?
X

ఏపీలో న్యూట్రల్ గా ఉంటే తన మద్దతు ఎన్నికల అనంతరం మీకే ఉంటుందని కాషాయం పెద్దలకు జగన్ చెప్పారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలలో ఏమి జరిగిందీ అందరికీ తెలుసు. టీడీపీ కూటమిలో బీజేపీ చేరింది. చేరిన తరువాత టీడీపీలో ఉంటూ బీజేపీలోకి జంప్ చేసిన నేతలకే ఎక్కువగా సీట్లు ఇచ్చింది.

అంతే కాదు టీడీపీ కోరిందే తడవుగా డిమాండ్లు అన్నింటినీ చేసి పెట్టింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు అని ప్రచారంలో ఉంది. అలాంటి బాబుకు బీజేపీ అండ బాగా ఈసారి ఎన్నికల వేళ దొరికింది అని అంటున్నారు. దాంతో కీలక నియోజకవర్గాలు అందునా వైసీపీకి కంచుకోటలు ఉన్న చోట టీడీపీ దూకుడు చేసింది.

ఎలక్షనీరింగ్ లో చాలా చోట్ల పై చేయి సాధించింది. కీలక స్థానాల్లో ఉన్న వారు అంతా బదిలీ అయ్యారు. మొత్తానికి చూస్తే జగన్ ఎన్నికల ప్రచారంలో ఉండగానే వీటి మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే సవ్యంగా ఎన్నికలు జరిగినట్లు కానే కాదు అని ఆయన ముందే అనేసారు.

ఆ విధంగానే జరిగింది అన్నది వైసీపీ నేతల భావన. వారు ఇపుడు కొన్ని చోట్ల రీపోలింగ్ కోరుతున్నారు అంటే అర్ధం చేసుకోవాల్సిందే. సరే ఇంత జరిగినా వైసీపీకి వేవ్ కనుక వస్తే అన్నీ కొట్టుకుని పోతాయని ఒక ధీమా ఇంకా ఉందిట. అలా వైసీపీకి ఏపీలో అధికారం దక్కి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే ఎవరికి మద్దతు ఇస్తారు అన్నదే చర్చగా ఉంది.

అయితే బీజేపీ మీద వైసీపీలో మంటెక్కిపోతోంది. దాంతో పాటుగా చంద్రబాబు ఆ కూటమిలో ఉన్నారు. దాంతో ఆ వైపుగా చూడకూడదు అన్న భావన ఉంది అంటున్నారు. ఇక ఇండియా కూటమికి అవకాశాలు మెరుగు అవుతున్నాయని కూడా చెబుతున్నారు. అలాగే ఇండియా కూటమికి మద్దతు ఇవ్వమని కీలక నేతల నుంచి రాయబారాలు వస్తున్నాయని అంటున్నారు.

అదే జరిగితే మాత్రం జగన్ గట్టిగానే ఆలోచించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇండియా కూటమికి అధికారానికి చేరువగా వచ్చి మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేకపోతే మాత్రం కచ్చితంగా వైసీపీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అంటున్నారు.

అదే సమయంలో ఒక కండిషన్ పెట్టి మద్దతు ఇస్తారు అని చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న దాని మీద మద్దతు ఇస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ విభజన తరువాత ఈ అంశం చేర్చింది. దానిని తరువాత వచ్చిన బీజేపీ అమలు చేయలేదు, అందువల్ల ఇండియా కూటమి కనుక అమలు చేస్తామంటే ఆ వైపునకే వైసీపీ వెళ్తుందని అంటున్నారు.

ఏపీ జనాలు కూడా ఈ విషయంలో పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తారు అని అంటున్నారు. అంతే కాదు విభజన అంశాలతో పాటు, పోలవరం వంటి కీలకమైన వాటి విషయంలో పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయంటే ఇండియా కూటమి వైపు వైసీపీ మొగ్గే చాన్స్ ఉందని అంటున్నారు.

బీజేపీ పెద్ద నాయకులు అయితే జగన్ కాంగ్రెస్ వైపు పోరని, ఆయనకు ఎన్డీయేకు మద్దతు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదని భావిస్తోంది. ఆ ధీమాను బ్రేక్ చేయడానికే వైసీపీ చూస్తుంది అని అంటున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఎవరు ఎటు వైపు అయినా మళ్ళవచ్చు.

కాంగ్రెస్ జగన్ కి అన్యాయం చేసింది అన్న కోపం ఉంది. కానీ బీజేపీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ కూడా కీలక సమయంలో దెబ్బ కొట్టింది అన్న బాధ అయితే వైసీపీ నేతలలో ఉంది అని అంటున్నారు. పరిస్థితులు ఏవైనా కేంద్రంలో ఇండియా కూటమి రావాలని బలంగా వైసీపీ నేతలు కోరుకుంటున్నారు అని అంటున్నారు.

దాని వల్ల ఏపీకి మేలు జరగడమే కాకుండా బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీకి కూడా రాజకీయంగా ఇబ్బంది అవుతుందని ఊహిస్తున్నారు. మొత్తానికి పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమే అన్న దానిని జగన్ రుజువు చేయబోతారా అన్నదే చర్చ. జూన్ 4 ఫలితాల తరువాత మాత్రం వైసీపీకి మొగ్గు వచ్చి అధికారం దక్కితే ఏపీ రాజకీయాలు వేరే లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. అంతే కాదు మోడీ షాలకు బిగ్ షాక్ ఇచ్చేలా ఉన్నా ఆశ్చర్యం లేదు అని ప్రచారం అయితే ఉంది. మరి దీనిలో నిజమెంత అంటే వేచి చూడాల్సిందే.