కళాకు అలా చెక్ పెట్టారా ?
ఇదిలా ఉంటే రాజకీయంగా తనకు చివరి ఎన్నికలుగా భావిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు.
By: Tupaki Desk | 16 Jun 2024 5:30 PM GMTఉత్తరాంధ్రాలో అత్యంత సీనియర్ అయిన నాయకుడు కిమిడి కళా వెంకట్రావు. ఆయన 1983లోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ హయాంలోనే మంత్రి పదవులు చేపట్టారు. ఒక సందర్భంలో హోం మంత్రిగా పనిచేశారు. ఆ మీదట చంద్రబాబు హయాంలోనూ మంత్రిగా పనిచేశారు. ఇదిలా ఉంటే రాజకీయంగా తనకు చివరి ఎన్నికలుగా భావిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు.
వైసీపీ నుంచి మంత్రి సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణను ఆయన ఓడించారు. దాంతో పాటు బొత్సను ఓడిస్తే కచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని హై కమాండ్ చెప్పినట్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయినా సరే కళాకు మంత్రి పదవి దక్కలేదు. ఏమి జరిగింది అంటే దాని వెనక టీడీపీలోనే కొందరు పెద్దలు అడ్డుకట్ట వేశారు అని ప్రచారం సాగుతోంది.
కళాకు ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు మధ్య రాజకీయంగా గ్యాప్ ఉంది. అలాగే కళా తన జిల్లాలో రాజకీయాలను శాసించడాన్ని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కూడా సహించలేరు అన్న మరో ప్రచారమూ ఉంది. దాంతో ఈ ఇద్దరు నేతల పలుకుబడి ఒత్తిడి మూలంగానే కళాకు మంత్రి పదవి తృటిలో తప్పిపోయింది అని ఆయన వర్గంలో అయితే ప్రచారం సాగుతోందిట.
ఇది ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాలో కళా ఆగమనంతో రాజకీయాలు పూర్తిగా మారుతాయని అంటున్నారు. తొందరలో గవర్నర్ గా అశోక్ గజపతిరాజు వేరే రాష్ట్రానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని ఆయన ప్రత్యక్ష క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతారని అంటున్నారు. దాంతో విజయనగరం జిల్లా రాజకీయాలకు కళావే రాబోయే రోజులలో పెద్ద దిక్కు అవుతారు అని అంటున్నారు
ఇంకో వైపు చూస్తే బొబ్బిలి రాజులు కూడా ఈసారి మంత్రి పదవిని ఆశించారు. మూడు దశాబ్దాల తరువాత టీడీపీకి బొబ్బిలిలో విజయం రుచి చూపించిన బొబ్బిలి రాజులకు బెర్త్ కంఫర్మ్ అని అనుకున్నారు. కానీ సీన్ మారిపోయింది అని అంటున్నారు. గజపతినగరం నుంచి గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ కి మంత్రి పదవి అనూహ్యంగా వరించింది.దాని వెనక అశోక్ చక్రం తిప్పారని అంటున్నారు.
ఏది ఏమైనా విజయనగరం జిల్లాలో మంత్రి పదవి రాని వారు అయితే కుమిలిపోతున్నారని టాక్. ఎస్ కోట నుంచి మరోసారి గెలిచిన సీనియర్ నేత కోళ్ల లలితకుమారి కూడా మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నట్లుగా చర్చ సాగుతోంది. కానీ ఆమె ఆశలూ గల్లంతు అయ్యాయని అంటున్నారు. ఇక జనసేన కోటాలో నెల్లిమర్లకు చెందిన లోకం మాధవి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. కానీ ఆమెకూ అది దక్కలేదు. మొత్తానికి అనూహ్యంగా కొండపల్లి శ్రీనివాస్ కి దక్కడంతో తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి మరొకరికి చాన్స్ ఉండదని అంటున్నారు.
పునర్వ్యవస్థీకరణలో ఏమైనా అవకాశం ఉండవచ్చేమో కానీ దానికి కూడా రెండున్నర నుంచి మూడేళ్ల కాలపరిమితి వరకూ వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి కళాకు ఈ టెర్మ్ లో మంత్రి పదవి దక్కుతుందా అన్నది ఆయన అభిమానుల ఆరాటంగా ఉందిట.