కేసీయార్ మరో ఎన్టీఆర్ అవుతారా...?
రెండు సార్లు తనను గెలిపించిన గజ్వేల్ సీటుతో పాటు కామారెడ్డి నుంచి కెసీయార్ పోటీ పడుతున్నారు.
By: Tupaki Desk | 15 Nov 2023 2:30 AM GMTకె చంద్రశేఖరరావు షార్ట్ కట్ లో కేసీయార్ ఒక ఉద్యమ నేత. తెలంగాణాకు తొలి సీఎం. వరసగా రెండు సార్లు గెలిచిన నాయకుడు. హ్యాట్రిక్ విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్న బీయారెస్ అధినేత. అలాంటి కేసీయార్ తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఒకేసారి పోటీ చేశారు.
కానీ ఫస్ట్ టైం ఒకేసారి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీకి దిగుతున్నారు. రెండు సార్లు తనను గెలిపించిన గజ్వేల్ సీటుతో పాటు కామారెడ్డి నుంచి కెసీయార్ పోటీ పడుతున్నారు. ఈ రెండూ గెలిస్తే కేసీయార్ అజేయుడుగా తెలంగాణాలో తిరుగులేని లీడర్ గా ముద్ర పడతారు.
అంతే కాదు ఆయన గతకాలపు మహా నాయకుల రికార్డులను సమం చేసిన వారు అవుతారు. ఇదిలా ఉంటే కేసీయార్ కంటే ముందు చాలా మంది రెండు నియోజకవర్గాలలో పోటీ చేసి ఉన్నారు. కానీ అలా పోటీ చేసి గెలిచిన వారు ఎన్టీఆర్. అలాగే ఒక సీటులో గెలిచి మరో సీటులో ఓడిన వారు కూడా ఎన్టీఆర్ నే చెప్పుకోవాలి.
ఎన్టీఆర్ సినీ జీవితాన్ని మూడున్నర దశాబ్దాల పాటు పండించుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వచ్చీ రావడంతోనే ఏకంగా సీఎం అయిపోయారు. ఇక ఎన్టీఆర్ రెండు సీట్లలో మూడు సీట్లలో ఒకేసారి పోటీ చేసి రికార్డుని నెలకొల్పారు.
ఎన్టీఆర్ 1985లో నల్గొండ, హిందూపురం, గుడివాడ మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హిందూపురంలో కొనసాగుతూ మరో రెండు నియోజకవర్గాలకు రాజీనామా చేశారు. ఇక 1989లో కూడా ఎన్టీఆర్ ఇలాంటి ప్రయత్నమే చేశాడు. కల్వకుర్తి, హిందూపురం నుంచి పోటీ చెస్తే హిందూపురం సీటులో ఆయన గెలిచారు. కల్వకుర్తిలో ఓటమి పాలు అయ్యారు.
ఇక 2019 లోక్ సభ ఎన్నికలనే తీసుకుంటే రాహుల్ గాంధీ యూపీలోని అమేధీ, అలాగే కేరళలోని వాయ్నాడ్ నుంచి పోటీ చేస్తే అమేధీలో ఓటమి పాలు అయ్యారు. వాయనాడ్ లో గెలిచారు. ఇక 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరంలలో పోటీ చేసి రెండు చోట్ల ఓటమి పాలు అయ్యారు. దాని కంటే కాస్తా వెనక్కి వెళ్తే ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి పాలకొల్లు, తిరుపతిలలో పోటీ చేస్తే పాలకొల్లులో ఓడారు, తిరుపతిలో గెలిచారు.
ఇలా కనుక రాజకీయాల్లో చూసుకుంటే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం కొత్తేమీ కాదు, అయితే పోటీ చేసిన రెండు చోట్లా గెలిచిన వారు అరుదు. ఎన్టీఆర్ మాత్రమే అలాంటి రికార్డుని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్నారు. మరి కేసీయర్ కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ శిష్యుడు. ఆయన 1983లో టీడీపీలో చేరి ఆ తరువాత అనేక పదవులు అందుకున్నారు.
ఎన్టీఆర్ లోని ఆవేశం కేసీయార్ కి కూడా ఉంది. దాంతో పాటు వ్యూహాలు కూడా కేసీయార్ కి ఉన్నాయి. మరి ఈసారి కేసీయార్ పోటీ చేసిన రెండు చోట్లా గెలిచి మరో ఎన్టీఆర్ అనిపించుకుంటారా అన్నదే అందరిలో సాగుతున్న చర్చ. తెలంగాణా ఎన్నికలు ఒక ఎత్తు అయితే గజ్వేల్, కామారెడ్డిలో ఫలితాలు మరో ఎత్తుగా అంతా చూస్తున్నారు అంతకంతకూ ఆసక్తిని పెంచేస్తున్న ఈ ఎన్నిక కేసీయార్ ని తెలంగాణా ఎన్టీఆర్ చేస్తుందా అంటే ఫలితం కోసం కొద్ది రోజులు ఆగాల్సిందే.