దక్షిణాదిన హ్యాట్రిక్ కొట్టిన సీఎం లేరు.. మరి కేసీఆర్?
తెలంగాణ సీఎం కేసీఆర్. మరి ఈ ఎన్నికల్లో గనుక ఆయన పార్టీ విజయం సాధిస్తే.. అది దక్షిణాదిన చరిత్ర తిరగరాసినట్లు అవుతుంది.
By: Tupaki Desk | 9 Nov 2023 12:30 AM GMTభారత దేశాన్ని భౌగోళికంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరగా చూస్తే, ఒడిసా నుంచి బెంగాల్, అసోం రాష్ట్రాలు తూర్పు. మహారాష్ట్ర, గుజరాత్, కొంత రాజస్థాన్ పడమర. దక్షిణాది విషయానికి వస్తే తెలంగాణ నుంచి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఉత్తరాది అంటే మధ్యప్రదేశ్ నుంచి దేశంలోని పై భాగం అంతా అనుకోవాలి. కాగా, రాజకీయంగా ఇప్పటికే ఉత్తరాది పెత్తనంపై ఎన్నో విమర్శలున్నాయి. ప్రధాని పదవిని ఉత్తర భారతం నాయకులు దక్షిణాది వారికి దక్కనీయరనే ప్రధాన అభియోగం ఉంది. అత్యంత బలమైన ఉత్తరాది లాబీని తట్టుకుని పనులు చేయించుకోవడమూ కష్టమేనని చెబుతుంటారు.
దక్షిణాదిన దమ్మున్న నాయకత్వం
ఉత్తరాది ప్రాబల్యం ఎంత ఉన్నప్పటికీ.. దక్షిణాదిన దమ్మున్న నాయకత్వం లేదని చెప్పలేం. ఒకనాటి అన్నాదురై నుంచి ఇప్పటి చంద్రబాబు వరకు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసినవారే. తెలుగువారి ఉనికినే కాదు.. ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్.. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇక అపర మేధావి అయిన పీవీ నరసింహారావు ఏకంగా ప్రధాన మంత్రి పదవినే అలంకరించారు. వీరేకాదు.. కర్ణాటకకు చెందిన హెడ్ దేవెగౌడ.. పీవీ తర్వాతనే ప్రధాని అయి దక్షిణాది ప్రాబల్యం చాటారు. మరికొందరు నాయకులు కూడా దక్షిణాది నుంచి ఢిల్లీకి వెళ్లి క్రియాశీలక పాత్ర పోషించారు.
హ్యాట్రిక్ కష్టమే..
క్రికెట్ లో హ్యాట్రిక్ అంటే చాలా కష్టం. ప్రతిభకు తోడు లక్ కూడా కలిసిరావాలి. రాజకీయాల్లోనూ అంతే. వరుసగా మూడుసార్లు గెలవడం వరకు ఓకే. అలాగైతే ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ తీసినవారూ ఉన్నారు. కానీ, హ్యాట్రిక్ సీఎం అంటే కష్టమే. అసలు సీఎం పదవి దక్కడమే కష్టం. రెండోసారీ దక్కడం ఇంకా కష్టం అని చెప్పాలి. ఇక హ్యాట్రిక్ అంటే అసాధారణమే. ఉదాహరణకు 1995లో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు 1999లోనూ గెలిచినా 2004లో ఓడిపోయి హ్యాట్రిక్ చేజార్చుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004, 2009లో వరుసగా సీఎం అయినా, హఠాన్మరణంతో హ్యాట్రిక్ రేసులోనే లేరు. తమిళనాడులో కరుణానిధి 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా వరుసగా మూడుసార్లు మాత్రం కాదు. జయలలిత 17 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ అదీ వేర్వేరు సందర్భాల్లోనే. అయితే, 2016లో వరుసగా రెండోసారి సీఎం అయిన ఆమె అనారోగ్యంతో చనిపోకుంటే హ్యాట్రిక్ కొట్టేవారేమో?
కేరళలో ఇప్పటికీ చాన్సే లేదు.. మరి కేసీఆర్?
ఒకసారి ఒక పార్టీకి, మరోసారి ఇంకో పార్టీకి అధికారం ఇచ్చే కేరళలో హ్యాట్రిక్ కు అవకాశమే లేదు. అయితే, ప్రస్తుత సీఎం పినరాయి విజయన్ మాత్రం వరుసగా రెండోసారి సీఎం అయ్యారు. ఆయనకు హ్యాట్రిక్ అవకాశం ఉంది. మరి సాధిస్తారోలేదో? వీరందరినీ పక్కనపెడితే.. ఇప్పుడు హ్యాట్రిక్ అవకాశం ఉన్న దక్షిణాది నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్. మరి ఈ ఎన్నికల్లో గనుక ఆయన పార్టీ విజయం సాధిస్తే.. అది దక్షిణాదిన చరిత్ర తిరగరాసినట్లు అవుతుంది. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుతో చరిత్ర నెలకొల్పిన కేసీఆర్.. మరో రికార్డునూ అందుకున్నట్లు అవుతుంది.