కోదండరాం సారు మంత్రి అవుతారా? మండలికి గవర్నర్ కోటాలో ప్రతిపాదన
దీనికితగ్గట్లే తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక అధిపతి ఆమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పంపింది.
By: Tupaki Desk | 1 Aug 2024 11:30 PM GMTదేశంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పది రాష్ట్రాలకు గవర్నర్ లను నియమించింది. వీరిలో ఆరు రాష్ట్రాలకు పూర్తిగా కొత్త గవర్నర్లు కాగా.. మరో నాలుగు రాష్ట్రాలకు ఇంచార్జి గవర్నర్ల స్థానంలో నియామకం చేప్టటింది. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్ గా త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఈయన రాజ కుటుంబానికి చెందినవారు. మరోవైపు ఇప్పటివరకు ఇంచార్జి గవర్నర్ గా ఉన్న సీపీ రాధాక్రిష్ణన్ మహారాష్ట్రకు పూర్తి స్థాయి గవర్నర్ గా వెళ్లారు. లోక్ సభ ఎన్నికల ముందు వరకు తెలంగాణ గవర్నర్ గా తమిళిసై వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆమె ఎన్నికల్లో పోటీకి సిద్ధపడడంతో రాధాక్రిష్ణన్ ను నియమించారు.
ఆ కోటాలో వీరికే చోటు..
తెలంగాణలో తమిళిసై గవర్నర్ గా ఉన్న సమయంలో శాసనమండలి పదవుల భర్తీపై అప్పటి బీఆర్ఎస్ సర్కారుతో విభేదించారు. నాటి కేసీఆర్ సర్కారు సామాజిక సేవ కోటాలో ప్రతిపాదించిన పేర్లను తిరస్కరించారు. దీంతో ఆ నియామకాలు అలానే నిలిచిపోయాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరిని ప్రతిపాదిస్తారనే ఆసక్తి నెలకొంది. దీనికితగ్గట్లే తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక అధిపతి ఆమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పంపింది. అయితే, దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఇద్దరి పేర్లను క్యాబినెట్ తీర్మానించి గవర్నర్ కు పంపవచ్చని హైకోర్టు పేర్కొంది. కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి కోదండరాం, ఆమీర్ అలీఖాన్ పేర్లనే పంపనున్నట్లు సమాచారం.
కొత్త గవర్నర్ ఆమోదం ఖాయమేనా?
కొత్త గవర్నర్ గా వచ్చిన జిష్ణుదేవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టాక తొలి నిర్ణయం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపైనే ఉంటుందా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే.. గురువారం కేబినెట్ సమావేశంలో కోదండరాం, ఆమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైకోర్టు సూచన, ప్రభుత్వ నిర్ణయం, కొత్త గవర్నర్ రాక నేపథ్యంలో ఎమ్మెల్సీల నియామకానికి ఆమోద ముద్ర పడినట్లేనని భావిస్తున్నారు.
కోదండరాం సారు మంత్రి అవుతారా?
తెలంగాణ మలి దశ ఉద్యమంలో కోదండరాం పాత్ర విస్మరించలేనిది. అయితే, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మాత్రం ఆయనను కనీసం దగ్గరకు తీయలేదు. దీంతోనే కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. గత ఏడాది ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కానుండడంతో మంత్రి పదవి కూడా లభించే చాన్సుందని భావిస్తున్నారు. అదే జరిగితే.. తెలంగాణ ఉద్యమకారులంతా సంతోషిస్తారనే చెప్పాలి.