కేటీఆర్ ను పార్లమెంట్ కు పంపనున్నారా?
ఎంపీ ఎన్నికల్లో మంచి పట్టు ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది.
By: Tupaki Desk | 1 Jan 2024 10:50 AM GMTతెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అనుకున్నా కుదరలేదు. దీంతో వారిలో నైరాశ్యం ఏర్పడింది. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డినా గెలుపు బాట పట్టేలేకపోయింది. ఈనేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పట్టు నిలుపుకుని బదులు తీర్చుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గెలుపు గుర్రాల వేటలో పడుతోంది. ఎంపీ ఎన్నికల్లో మంచి పట్టు ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ తన ఓటింగ్ శాతం పెంచుకుంది. దీంతో బీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైంది. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు పెరిగే సూచనలుండటంతో నేతలను కాపాడుకునే ప్రయత్నంలో పడింది. నేతలపై బాధ్యతలు అప్పగించి వారిని దారి తప్పకుండా చేయాలనే యోచనలో కేసీఆర్ పడిపోయారు.
ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి కార్యనిర్వహణ అధ్యక్షుడిగా కేటీఆర్ వ్యవహరించారు. చాలా సందర్భాల్లో సహనం కోల్పోయి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం తెచ్చాయనే వాదనలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో హరీష్ ట్రబుల్ షూటర్ గా తన బాధ్యతలు సమర్థంగా పోషించిన హరీష్ కు కీలక బాధ్యతలు అప్పగించి పార్టీని గాడిలో పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
కేటీఆర్ ను పార్లమెంట్ కు పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో పార్టీ వాయిస్ వినిపించే నేత లేకపోవడంతో కేటీఆర్ ను ఎంపీగా పోటీలో ఉంచాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కవితను ఎమ్మెల్సీగానే ఉంచి కేటీఆర్ ను మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేయించి పార్లమెంట్ లో బలమైన ఎంపీగా నిలబెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానుండటంతో శాసనసభలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. ఇప్పటి వరకు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి వంటి మాజీ మంత్రులే కాంగ్రెస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ తో సూటిగా జరిగే సంభాషణలు ఎటు దారి తీస్తాయోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.