మంత్రి పదవికి లోకేష్ దూరం ?
లోకేష్ ఓడిన మరుక్షణం అక్కడ పెట్టిన ఫోకస్ జనంతో మమేకం అయిన తీరు ఆయన విజయానికి కారణం అని అంటున్నారు.
By: Tupaki Desk | 23 May 2024 1:30 AM GMTఈసారి ఎన్నికల్లో అందరినీ ఆకట్టుకునే అసెంబ్లీ సెగ్మెంట్లలో మంగళగిరి కూడా ఒకటి. నారా లోకేష్ అక్కడ నుంచి పోటీలో ఉన్నారు. గతసారి మంత్రిగా ఉంటూ పోటీ చేసిన చినబాబు దాదాపుగా అయిదు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఈసారి మాత్రం అలా కాదు ఆయన కచ్చితంగా గెలుస్తారు అని అంటున్నారు. లోకేష్ ఓడిన మరుక్షణం అక్కడ పెట్టిన ఫోకస్ జనంతో మమేకం అయిన తీరు ఆయన విజయానికి కారణం అని అంటున్నారు.
అదే టైంలో లోకేష్ మీద ఎవరిని నిలబెట్టాలి అన్న దాని మీద వైసీపీలో నెలకొన్న కన్ఫ్యూజన్ చివరి దాకా కొనసాగింది. నాలుగున్నరేళ్ల పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామక్రిష్ణారెడ్డిని మార్చి గంజి చిరంజీవిని తెచ్చి పెట్టారు. ఆయన జనంలోకి వెళ్తూండగా మార్చే మురుగుడు లావణ్యను తెచ్చారు. ఆమె వచ్చాక వైసీపీ ఊపు తగ్గింది అని అంచనాలు ఉన్నాయట. ఇక పోలింగ్ సరళిని చూసుకున్నా లోకేష్ మంచి మెజారిటీతో బయటపడతారు అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే చినబాబు ఈసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని అంటున్నారు. మరి టీడీపీ కూటమి వస్తే కనుక చినబాబు మంత్రి అవుతారా అంటే అందులో డౌట్ ఏముందని అంతా అంటున్నారు. ఎందుకంటే ఆయన 2017లోనే మంత్రిగా ఉంటూ అయిదు కీలక శాఖలను చూసారు. ఈసారి ఆయన గెలిస్తే అత్యంత కీలక శాఖలను చూస్తారు అని అంటున్నారు.
అయితే ఈ ప్రచారానికి విరుద్ధంగా మరో వైపు కొత్త ప్రచారం సాగుతోంది. అదేంటి అంటే లోకేష్ గెలిచినా మంత్రివర్గంలో చేరరు అని. అదేంటి లోకేష్ టీడీపీకి ఆశాకిరణం కదా ఆయన మంత్రి కాకపోవడం ఏంటి అంటే అదే బాబు మార్క్ వ్యూహం అని అంటున్నారు. ఈసారి చంద్రబాబు సీఎం అయితే చాలా మార్పులు చేస్తారు అని అంటున్నారు.
గత పాలనను భిన్నంగా ఆయన ఆలోచనలు ఉంటాయని చెబుతున్నారు. అదే విధంగా చంద్రబాబు ఈసారి అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. 2019లో తన కుమారుడు తాను ఇద్దరూ క్యాబినెట్ లో ఉండడం వల్లనే విమర్శలు వచ్చాయి కాబట్టి ఈసారికి ఆయనను పక్కన పెట్టి మిగిలిన వారికి అవకాశం ఇస్తారని అంటున్నారు. అంతే కాదు తనకు బంధు ప్రీతి లేదు అని చెప్పుకోవడం తో పాటు కుటుంబ పాలన అన్న విమర్శలకు ఆస్కారం లేకుండా చూసుకుంటారు అని అంటున్నారు.
కేంద్రంలో బీజేపీ ఉంది. ఆ పార్టీ కూడా టీడీపీ కూటమిలో ఉంది. దాంతో బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకం అని అంటున్నారు. దాంతో బీజేపీ నుంచి ఎలాంటి అసంతృప్తులు రాకుండా చూసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు అని అంటున్నారు. 2018లో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినపుడు తన కుమారుడు కేటీఆర్ ని మేనల్లుడు హరీష్ రావుని మంత్రి పదవులకు చాలా కాలం పాటు తీసుకోలేదు. కొంత కుదురుకున్నాక తీసుకున్నారు
అలా చంద్రబాబు కూడా చేయవచ్చు అని అంటున్నారు. ఇక టీడీపీని బలోపేతం చేసే విషయంలో పూర్తి స్వేచ్చను ఇస్తూ చినబాబుని పార్టీ కార్యక్రమాలకే ఎక్కువగా వాడుకుంటారు అని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి ప్రభుత్వం మీదనే ఫోకస్ ఉంటుంది. అప్పుడు పార్టీ మీద శ్రద్ధ తగ్గుతుంది. అదే తరువాత కాలంలో కొంప ముంచుతుంది. టీడీపీకి అలా కాకుండా లోకేష్ ని పూర్తిగా పార్టీకే వినియోగిస్తారని దాని వల్ల ఆయన అధికారంలో ఉన్న పార్టీ నేతగా మరింత దూకుడుగా జనంలోకి వెళ్ళే చాన్స్ ఉంటుందని అంటున్నారు.
లోకేష్ సైతం పార్టీని చూసుకోవడానికే ఆసక్తి ఎక్కువగా చూపించవచ్చు అని అంటున్నారు. ఇక ఈసారి చాలా మంది సీనియర్లతో పాటు జూనియర్లు ఆశావహులు మంత్రి పదవుల కోసం క్యూ కడతారు. దాంతో లోకేష్ నే మంత్రి వర్గంలోకి తీసుకోకపోతే చాలా మందికి జవాబు అలా చెప్పినట్లు అవుతుందని వారు కూడా వెనక్కి తగ్గుతారు అన్న మరో వ్యూహం కూడా దీని వెనక ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే లోకేష్ ఈసారి మంత్రి పదవికి దూరంగా ఉంటారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.