Begin typing your search above and press return to search.

ఏపీకి మోడీ వరాలు ఇస్తారా ?

సీనియర్ నాయకుడు చంద్రబాబు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Jun 2024 3:11 PM GMT
ఏపీకి మోడీ వరాలు ఇస్తారా ?
X

ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏ రాష్ట్రానికి వెళ్లకుండా తొలి టూర్ ఏపీకే పెట్టుకున్నారు. దానికి సందర్భం కూడా చాలా బాగా కుదిరింది. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీనియర్ నాయకుడు చంద్రబాబు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరవుతున్న ప్రధాని మోడీ ఏమి మాట్లాడుతారు అన్న చర్చకు తెర లేచింది. మోడీ 2014 నుంచి అనేక సార్లు ఏపీకి వచ్చారు. ప్రధాని అభ్యర్థిగా ఆయన ఏపీని ఆదుకుంటామని చెప్పిన మాటలు జనాలకు ఇంకా గుర్తు ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు.

ఆఖరుకు అది ముగిసిన అధ్యాయం అనిపించారు. ఇపుడు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కూడా ఏపీనే మొదటిగా ఎంచుకున్నారు. ఏపీకి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గత మూడేళ్ళుగా వధ్య శిల మీద నిలబెట్టారు. ఏ క్షణాన వేటు పడి ప్రైవేటూ అ వుతుందో తెలియదు.

ఇక పోలవరం ప్రాజెక్ట్ కధ చెప్పుకుంటే ఏపీకే నగుబాటు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే దశాబ్ద కాలం పైగా పట్టడం అది కూడా జాతీయ ప్రాజెక్ట్ గా ఉండడం అంటే ఆలోచించాల్సిందే. విభజన నాడు ఇచ్చిన హామీలు కానీ ఏపీని అన్ని రకాలుగా ఆదుకుంటామని చేసిన బాసలు కానీ ఏవీ చాలా కాలంలో ఊసులో లేవు

కానీ ఏపీ మాత్రం మంచి మనసు చేసుకుని మోడీని ఆదరించింది. ఎన్డీయే కూటమికి అతి భారీ మెజారిటీ ఇచ్చి పట్టం కట్టింది. ఉత్తరాది రాష్ట్రాలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న వేళ ఏపీయే బీజేపీని తలెత్తుకునేలా చేసింది. మోడీని మూడవసారి ప్రధానిని చేసి ఆయన సరికొత్త రికార్డుని సాధించడానికి ఉపయోగపడింది.

ఇలా ఏపీ అన్ని రకాలుగా అండగా ఉన్నది. ప్రత్యేకింది 2024 ఎన్నికల్లో అయితే అది ఇంకా కీలకంగా మారిన వేళ బీజేపీకి ప్రాణ వాయువునే ఇచ్చింది. మరి ఇంత చేసి కేంద్రం వైపు ఆశగా ఎదురుచూస్తున్న ఏపీని ఆదుకోవడం దేశ పెద్దగా ప్రధానిగా గతంలో హామీ ఇచ్చిన నాయకుడిగా మోడీ ధర్మం అని అంటున్నారు. ఏపీని ఆదుకోవడం నైతికంగా కూడా చాలా అవసరం.

ఏపీ విషయంలో ఎంత చేసినా మిగిలిన రాష్ట్రాలు కూడా ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే దశాబ్దం క్రితం అడ్డ గోలు విభజన ఏపీ ఎంతలా అన్యాయం అయిందో దేశం మొత్తానికి తెలుసు. ఆ తరువాత పదేళ్ళుగా ఏపీ ఎంతలా నిర్లక్ష్యానికి గురి అయిందో కూడా తెలుసు.

అందువల్ల ఏపీ విషయంలో మోడీ ఏమి చెబుతారు ఏ రకమైన వరాలు ఇస్తారు అన్న ఆసక్తి అందరిలో ఉంది. అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చినపుడు మట్టి నీళ్ళు ఇచ్చినట్లుగా చేయకుండా ధర్మ పన్నాలు వల్లించకుండా బీజేపీ పెద్దలు ఏపీకి తాము ఏమి చేయబోతోంది కచ్చితంగా చెప్పాలి. వీలు అయితే వరాలను వరసగా ప్రకటించాలి కూడా.

ఏపీ సీఎం చంద్రబాబు అడగాలి అని చాలా మంది అంటున్నారు. ఆయన అడగడం కంటే మోడీ తానుగా ముందుకు వచ్చి ఏపీని దేశంలో ముందు భాగాన నిలబెట్టడానికి ఏమి చేస్తామో చెప్పడమే సబబు అని అంటున్నారు. ఏపీ గురించి బీజేపీకి తెలియనిది కాదు. అదే విధంగా చంద్రబాబు గతంలో ఎన్నో సార్లు అడిగి ఉన్నారు.

కొత్త ముఖ్యమంత్రిగా మరోసారి కేంద్ర పెద్దల ముందు బాబు మాకు ఇది ఇవ్వండి అని చేయి చాచి అడిగే పరిస్థితి తేకుండా ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడేలా కేంద్రమే ముందుకు రావాలని అంటున్నారు. దీని వల్ల బీజేపీ ఖ్యాతి పెరుగుతుంది. అలాగే మాట నిలబెట్టుకున్న వారు అవుతారు. రేపటి రోజున ఏపీలో బీజేపీకి రాజకీయంగానూ మేలు జరుగుతుంది.

బీజేపీ రేపటి ఆశలు అన్నీ తెలుగు రాష్ట్రాలే అయినపుడు బీజేపీ పెద్దలు ఎలాంటి శషబిషలకు తావు ఇవ్వకుండా ఏపీకి గట్టి మేలు తలపెట్టే ప్రకటనలు చేయాలి. వాటిని ఆచరణలో నిజం చేయాలి. అంతే తప్ప అంతా బాగుంది. ఏపీ గొప్పది అంటూ పడికట్టు పదాలు మాట్లాడితే మాత్రం అయిదు కోట్ల ఆంధ్రులు ఉస్సురనడం ఖాయం. అలాంటి పరిస్థితి రాకూడదనే అంతా కోరుకుంటున్నారు.