మోడీ మాటల్లో తేడా...కనిపెట్టిందెవరబ్బా !?
2014 మే 26న అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అయిన భారత్ కి 18వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
By: Tupaki Desk | 27 May 2024 8:50 AM GMTఅయన మాటల మరాఠీ. మైకు అందుకుంటే చాలు గంటల తరబడి అనర్గళంగా మాట్లడే సత్తా ఆయన సొంతం. ఆయనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ. 2014 మే 26న అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అయిన భారత్ కి 18వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
తనదైన మాటల చతురతతో కోట్లాది మందిని బీజేపీ వైపుగా తిప్పగలితే సామర్థ్యం ఆయన సొంతం అందుకే మోడీ రెండు సార్లు బీజేపీకి పూర్తి మెజారిటీని తీసుకుని రాగలిగారు. ఇక 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ప్రధాని కావాలని ఆయన ఆశ. అలా సాధిస్తామని బీజేపీ ధీమా కూడా.
కానీ ఇప్పటికి ఆరు విడతల పోలింగ్ ముగిసింది. తొంబై శాతం ఎంపీలను జనాలు ఎన్నుకున్నారు. ఇందులో బీజేపీ వాటా ఎంత అంటే నూటికి ఎనభై శాతం అని ఆ పార్టీ కడు నమ్మకంగా చెబుతోంది. కానీ ఇండియా కూటమి మాత్రం అలా కానే కాదు అని అంటోంది.
ఇండియా కూటమికే సీట్లు బాగా పెరిగాయని చెబుతోంది. ఈసారి బీజేపీ సొంతంగా కానీ ఎన్డీయే కూటమితో కానీ మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేదు అని అంటోంది. దానికి సాక్ష్యం ఏమిటి అంటే మోడీ బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడుతున్న తీరు అని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు
ఎస్పీ అధినేత యూపీలో ఈసారి ఏకంగా డెబ్బై అయిదుకు పైగా ఎంపీలు గెలుస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్న అఖిలేష్ యాదవ్ అయితే మోడీ మాటలలో తేడా ఉందని అంటున్నారు. మోడీ వాడుతున్న భాష కూడా ఏ మాత్రం బాగులేదని ఆయన విమర్శించారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇండియా కూటమి నేతలు ముజ్రా డ్యాన్స్ చేస్తున్నారు అన్న ప్రధాని మోడీ కామెంట్స్ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడడం అంటే బీజేపీ వారి అసహనాన్ని ఇది తెలియజేస్తుంది అని ఆయన అన్నారు. అలాగే ఓటమి భయం వారికి పట్టుకుందని అంటున్నారు.
ఈసారి ఎన్నికల్లో తాము దెబ్బ తింటామన్న భయం నుంచే ఈ తరహా వ్యాఖ్యలు వినవస్తున్నాయని అన్నారు. బీజేపీకి ఈసారి 200 ఎంపీ సీట్లు కూడా వస్తాయా అన్న డౌట్ అయితే కలుగుతోందని అఖిలేష్ యాదవ్ అనడం విశేషం.
ఏ రాజకీయ పార్టీకైనా తమ మీద తమకు నమ్మకం తగ్గినపుడే ఈ తరహా విమర్శలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అంటున్నారు. మరి మోడీ వాడిన ముజ్రా డ్యాన్స్ అన్నది ఒక అసభ్య నృత్యానికి ప్రతీక అని అన్నారు. అంటే విపక్షాలను అలా ఎందుకు ఆగ్రహంగా విమర్శించాల్సి వస్తోంది అన్నదే ఇండియా కూటమి నుంచి వస్తున్న ప్రశ్న.
అంటే గెలుపు ధీమా ఎన్డీయే కూటమిలో సడలిందా అన్న చర్చ కూడా మొదలైంది అంటున్నారు. ఈసారి బీజేపీ ఎన్నికల ప్రచారం కూడా అనేక రకాలుగా సాగిందని ఏ విషయం మీద కూడా పూర్తిగా నిలబడి ప్రచారం చేయలేదని గుర్తు చేస్తున్నారు రాముడి మందిరంతో స్టార్ట్ చేసి ఇపుడు విపక్షాల మీద విరుచుకుపడే స్థాయికి వచ్చారని అంటున్నారు. దాంతోనే ఇండియా కూటమి తాము కచ్చితంగా నెగ్గి తీరుతామని అంటోంది.
అయితే బీజేపీ దూకుడు రాజకీయాన్ని చూసి జవాబు చెప్పలేక వంకలు వెతుకుతున్నారు అని ఇండియా కూటమి నేతలను ఎన్డీయే పక్షాలు విమర్శిస్తున్నాయి. గెలుపు ధీమా లేనిది ఇండియా కూటమిలోనే మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. దేశాన్ని పదేళ్ల పాటు సమర్ధంగా నడిపించిన మోడీ కానీ బీజేపీ కానీ మళ్లీ గెలుస్తామని పూర్తి ఆత్మ విశ్వాసంతోనే ముందుకు సాగుతోంది అని వారు అంటున్నారు. బాడీ లాంగ్వేజ్ భాషలో తేడా ఓటమికి సూచినా లేక దూకుడుకు ప్రతీకా అన్నది రిజల్ట్ మాత్రమే చెప్పగలదు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.