జూలై మూడోవారంలో చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్!
ఇందులో భాగంగా.. ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును ఆమె తిరగరాస్తారు.
By: Tupaki Desk | 14 Jun 2024 3:32 AM GMTకేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోడీ 3.0 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు నిర్మాలా సీతారామన్. ఈ సమయంలో ఆమె ఓ అరుదైన రికార్డ్ ముంగిట ఉన్నారని చెప్పాలి. ఇందులో భాగంగా.. ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును ఆమె తిరగరాస్తారు. జూలై మూడోవారంలో ఆ రికార్డ్ నమోదయ్యే అవకాశం ఉంది.
అవును... 2024 - 25 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ జూలై మూడో వారంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మాలా సీతారామన్... ఆ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2024 - 25 సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు.
ఇందులో భాగంగా... దేశ ఆర్థిక ప్రాధాన్యతలు, నిర్ధేశించుకున్న లక్ష్యాలు, సవాళ్లకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని.. కచ్చితమైన ప్రణాళిక, సమగ్ర విశ్లేషణలతో బడ్జెట్ ను సిద్ధం చేయాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా స్పందించిన నిర్మలా సీతారామన్... గత పదేళ్లుగా చేపట్టిన సంస్కరణలు ఇకపైనా కొనసాగుతాయని అన్నారు.
వికసిత్ భారత్ లక్ష్య సాధనను వేగవంతం చేసే దిశగా చర్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో... జూలై మూడోవారంలో కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అయితే అదే రోజు నిర్మాలా సీతారామన్ సరికొత్త రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా... ఆమె వరుసగా 7సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా రికార్డ్ నెలకొల్పనున్నారు. తద్వారా మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డ్ ను ఆమె తిరగరాస్తారు. వీరిద్దరూ ఇప్పటివరకూ 5 పూర్తిస్థాయి, 1 మధ్యంతరం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
మరోపక్క 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జూన్ 22న జరగనుంది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.