పవన్ ఆదర్శాలు ఆచరణలో సాధ్యమేనా ?
మరి ఆయన ఆదర్శాలు ఆచరణలో ఎంతమేరకు అమలు అవుతాయన్నది చూడాలని అంటున్నారు.
By: Tupaki Desk | 25 Aug 2024 3:29 AM GMTజనసేన అధినేతగా ఉన్నప్పటి నుంచి పవన్ ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలనే తపించారు. ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన ఆదర్శాలు ఆచరణలో ఎంతమేరకు అమలు అవుతాయన్నది చూడాలని అంటున్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తుంది.
వాటిని ఆయా పంచాయతీలకు సక్రమంగా ఇవ్వాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మటుకు ఈ నిధులను ముందుగా తమ ఖర్చులకు వాడుకుంటూ వెసులుబాటు కుదిరినపుడు పంచాయతీలకు విడతల వారీగా ఇవ్వడం జరుగుతోంది. అది దేశమంతా అలాగే ఉంది.
అలా పంచాయతీల నిధులను వాడుకుని తిరిగి ఇచ్చిన ప్రభుత్వాలు మంచివిగా ఉంటున్నాయి. అది కూడా లేకుండా మొత్తానికే సున్నం పెట్టే ప్రభుత్వాలు ఉన్నాయి. అలాంటి ప్రభుత్వమే వైసీపీ అని టీడీపీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే పంచాయతీ నిధులను ఒక్క పైసా కూడా దారి మళ్ళించకుండా చూస్తామని చెబుతున్నారు.
అన్ని నిధులూ గ్రామాలకు చేరాలని గ్రామాలు స్వర్ణ సీమలు కావాలని ఆయన అంటున్నారు. దానితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పంచాయతీలకు మరిన్ని నిధులు ఇస్తే స్థానిక స్వపరిపాలన సక్రమంగా సాగుతుంది. గ్రామాలు ప్రగతిపధంలో సాగుతాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు ఇస్తాయా అలా చేయగలుతాయా అన్నది కూడా ప్రశ్నగా ఉంది.
మరో వైపు చూస్తే గ్రామీణ ఉపాధి పధకానికి ఇచ్చే నిధులను కూడా గ్రామ స్థాయిలో తీసుకునే పార్టీ జనాలు ఉన్నయి. పనికి రాకపోయినా వచ్చినట్లుగా రాయించేసి భోగస్ వివరాలతో జాతీయ ఉపాధి హామీ పధకం నిధులకు కన్నం పెట్టే ఘనాపాఠీలు అన్ని పార్టీలలో ఉన్నారు.
ఎవరు అధికారంలోకి వస్తే వారే ఈ విధంగా చేస్తూ పోతున్న నేపధ్యం ఉంది. ఇలాంటి వాటిని అరికట్టాలంటే కేవలం చిత్తశుద్ధి ఉంటే సరిపోదు. పూర్తిగా నిఘా పెట్టాలి. కఠినంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ అయితే ఆ శాఖ మంత్రిగా ఒక పైసా కూడా పక్కకు పోవడానికి వీలు లేదని చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన పట్టుదలగా ఉన్నారు.
పంచాయతీలను దేశానికే పట్టుగొమ్మలుగా ఆయన అభివర్ణిస్తున్నారు. పవన్ ఆశయం కనుక నెరవేరితే మాత్రం పంచాయతీలకు తిరుగు ఉండదు. ఆ విధంగా జరగాలనే అంతా కోరుకుంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున సాయం చేస్తే గ్రామ సీమలు అద్భుతాలనే సృష్టిస్తాయన్నది వాస్తవం.