పెద్దిరెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందా ?
ఇపుడు ఆయన ఇదే విషయం మీద హైకోర్టుకు వెళ్లారు. జూలై 4న రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు.
By: Tupaki Desk | 29 July 2024 4:15 PMచిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసన సభ్యత్వం రద్దు అవుతుందా, ఆయన మీద అనర్హత వేటు కత్తి వేలాడుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి తన ఆస్తుల విషయంలో తప్పుడు అఫిడవిట్ ఎన్నికల సంఘానికి సమర్పించారన్నది అభియోగం.
దీనిని బయటకు తెచ్చిన వారు ఆయన నియోజకవర్గానికి చెందిన రాజకీయ నేత రామచంద్ర యాదవ్. ఆయన పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా తాజాగా హైకోర్టులో పిటిషన్ దీని మీదనే దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం దీనికి సంబంధించి విచారణ జరగనుంది అని అంటున్నారు.
ఈ పిటిషన్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పెద్దిరెడ్డి ఆస్తుల వివరాలు కోరింది. అంతే కాదు పెద్దిరెడ్డి మీద పుంగనూరులో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయిన టీడీపీ అభ్యర్ధి చల్లా రామచంద్రారెడ్డిని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.
విషయం ఏంటి అంటే పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేసినపుడు తన భార్య స్వర్ణలతకు చెందిన 142 ఆస్తులు వేరే చోట్ల ఉన్న వాటిని అందులో పొందుపరచలేదు అన్నది రామచంద్ర యాదవ్ ఆరోపణ. ఆయన ఎన్నికల సంఘానికి అలాగే గవర్నర్ కి ఇతర ఉన్నతాధికారులకు ఎన్నికల ముందే ఈ విషయం మీద ఫిర్యాదు చేసినా అప్పట్లో స్పందన లేదు అని అంటున్నారు.
ఇపుడు ఆయన ఇదే విషయం మీద హైకోర్టుకు వెళ్లారు. జూలై 4న రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇపుడు పెద్దిరెడ్డి చిక్కుల్లో పడినట్లుగా ఉందని అంటున్నారు. తప్పుడు అఫిడవిట్ ఇచ్చినా లేక వివరాలు సక్రమంగా లేకపోయినా ఆ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడుతుంది.
దాంతో పాటు గా పెద్దిరెడ్డిని పూర్తిగా టార్గెట్ చేసిన ఏపీలోని ఎన్డీయే కూటమికి ఇదొక అవకాశంగా ఉందని అంటున్నారు. ఇప్పటికే మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధమైన ఘటన మీద ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దాని మీద పూర్తి విచారణకు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి మీద హై కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఆయన విషయంలో ఉన్నత న్యాయ స్థానంలో ఏ విధంగా తీర్పు వస్తుంది అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు.మరో వైపు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే పెద్దిరెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందని అక్కడ మళ్లీ ఎన్నికలు పెడతారు అని అంటున్నారు.
అయితే న్యాయపరంగా డివిజన్ బెంచ్ కి అప్పీలు చేసుకోవడంతో పాటు సుప్రీం కోర్టు దాకా వెళ్ళి పెద్దిరెడ్డి న్యాయ పోరాటం చ్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా పెద్దిరెడ్డికి బ్యాడ్ టైం జరుగుతోందా అన్నదే చర్చగా ఉంది.