Begin typing your search above and press return to search.

ఏ షరతుకైనా రెఢీ బెయిల్ ఇవ్వండి ప్రభూ పిన్నెల్లి తాజా వినతి

పోలింగ్ రోజు పాల్వాయి గేటు దగ్గర పిన్నెల్లి విశ్వరూపాన్ని ప్రపంచమంతా తమ ఫోన్లలో చూసేశారు.

By:  Tupaki Desk   |   4 Aug 2024 5:31 AM GMT
ఏ షరతుకైనా రెఢీ  బెయిల్ ఇవ్వండి ప్రభూ  పిన్నెల్లి తాజా వినతి
X

ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన ఏపీ నాయకుల్లో పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఒకరు. మాచర్లలో తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించిన ఆయనకు ఎదురే ఉండదన్నది అందరికి తెలిసిందే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు పిన్నెల్లి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలింగ్ బూత్ లోకి చొరబడి.. ఈవీఎంను నేలకేసి బద్ధలు కొట్టే బరితెగింపునకు ఏ నాయకుడూ ఇష్టపడడు. అలాంటి పని కూడా చేసిన పిన్నెల్లి.. కెమేరాకు అడ్డంగా దొరికేశారు. పోలింగ్ రోజు పాల్వాయి గేటు దగ్గర పిన్నెల్లి విశ్వరూపాన్ని ప్రపంచమంతా తమ ఫోన్లలో చూసేశారు.

ఎన్నికల పోలింగ్ తర్వాతి రోజున కారంపూడిలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేయటం.. సీఐ నారాయణస్వామిని గాయపర్చటం లాంటి ఘటనలతో అడ్డంగా బుక్ అయిన ఆయన.. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన కొద్దిరోజులకు అరెస్టు అయ్యారు. అది కూడా కోర్టు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నది తేలిన తర్వాతే. అనంతరం ఆయన్ను అరెస్టు చేసి నెల్లూరు జైలుకు పంపారు. బెయిల్ కోసం పిన్నెల్లి చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఎప్పటికప్పుడు కోర్టు సైతం ఆయన వినతుల్ని కొట్టేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ పెద్దల ప్రోద్బలంతో తనను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారంటూ చెబుతున్నఆయన.. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన కీలక అప్పీల్ చేశారు. కోర్టు విధించే ఏ షరతుకైనా తాను కట్టుబడి ఉంటానని.. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే దిగువ కోర్టును రెండుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించి భంగపడిన ఆయన ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ సోమవారం జరగనుంది.

మొత్తంగా జైల్లో నలబై రోజులు కూడా లేని పిన్నెల్లి.. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. అయిత.. రెంటచింతల.. కారంపూడి పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులు బలంగా ఉండటం.. వీటికి తోడు ఈవీఎంలు బద్దలు కొట్టటం లాంటి ఘటనల నేపథ్యంలో ఆయన బెయిల్ వినతిని హైకోర్టు ఏమంటుందో చూడాలి. మొత్తానికి జైలు జీవితం పిన్నెల్లిని దేనికైనా రాజీ పడేలా చేసేలా మార్చిందన్న మాట కొందరు నేతల నోట వినిపిస్తుండటం గమనార్హం.