Begin typing your search above and press return to search.

చిన్నమ్మ ఎంపీ సీటు పదిలమేనా ?

అలా పదేళ్ళ పాటు చక్కగా సాగిన ఆమె రాజకీయ జీవితం విభజన పుణ్యమాని పక్క దారి పట్టింది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 1:30 AM GMT
చిన్నమ్మ ఎంపీ సీటు పదిలమేనా ?
X

రాజమండ్రిలో బీజేపీ అభ్యర్ధిగా కూటమి తరఫున పోటీ చేసిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ జాతకం జూన్ 4న ఫలితాలలో తేలనుంది. ఆమె 2004లో కాంగ్రెస్ తరఫున రాజకీయ ప్రవేశం చేసి రెండు సార్లు ఎంపీ అయ్యారు. తొలిసారి బాపట్ల నుంచి గెలిచారు. రెండవసారి విశాఖ నుంచి ఎంపీ అయ్యారు. కేంద్రంలో మంత్రిత్వ శాఖలను కూడా చూసారు.

అలా పదేళ్ళ పాటు చక్కగా సాగిన ఆమె రాజకీయ జీవితం విభజన పుణ్యమాని పక్క దారి పట్టింది. 2014లో బీజేపీలో చేరిన ఆమె రాజంపేట లోక్ సభ స్థానం నుంచి ఆనాడు టీడీపీ కూటమి అభ్యర్థి గా పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. 2019లో పొత్తులు లేని వేళ విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్లను సైతం కోల్పోయారు.

ఇక ఇపుడు చూస్తే టీడీపీ కూటమితో పొత్తు ఉంది. అన్ని రకాలైన అవకాశాలు ఉన్నాయి. కానీ సీటు ఎంపిక విషయంలో ఆమె తప్పు చేశారు అన్న మాట ఉంది. ఆమె విశాఖ నుంచి పోటీ చేసి ఉంటే కచ్చితంగా ఎంపీ అయ్యేవారు. ఆ మీదట కేంద్ర మంత్రి కూడా అయ్యే చాన్స్ ఉండేది అని అంటున్నారు.

అయితే తన తమ్ముడు బాలయ్య అల్లుడి కోసం ఆమె ఆ సీటు త్యాగం చేసి రాజమండ్రిలో పోటీ చేశారు. అయితే బీజేపీలో మొదటి నుంచి ఉన్న సోము వీర్రాజు వంటి వారికి సీట్ల విషయంలో హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఒక బలమైన సామాజిక వర్గం ఆమెకు వ్యతిరేకం అయింది అన్న చర్చ పోస్ట్ పోల్ అంచనాల తరువాత బయటకు వస్తోంది.

అలా పురంధేశ్వరికి రాజమండ్రి సీటులో విజయావకాశాలు సగానికి సగం మాత్రమే ఉన్నాయని అంటున్నారు. దాంతో ఆమె రాజకీయం ఏమిటి అన్నది ఒక పెద్ద చర్చగా మారింది. ఆమె కనుక ఈసారి ఓటమి పాలు అయితే ఆమెకు ఉన్న బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఉండదని అంటున్నారు.

దాంతో ఆమె ఒక మామూలు నాయకురాలిగానే ఉండాల్సి ఉంటుంది. ఏపీ మీద ప్రేమ చూపించి బీజేపీ ఎవరికీ రాజ్యసభ ఇచ్చే సీన్ లేదని గత రెండు టెర్మ్ ల మోడీ టెన్యూర్ లో రుజువు అయింది. ఈసారి దగ్గుబాటి పురంధేశ్వరికి ఆ విధంగా చూస్తే విజయం అనేది చాలా ముఖ్యం.

కానీ వస్తున్న అంచనాలు చూస్తూంటే ఆమె గెలుపు కోసం కష్టపడాల్సిందే అంటున్నారు. అయితే 2009లో అతి తక్కువ మెజారిటీతో ఉండవల్లి అరుణ్ కుమార్ ని గెలిపించింది ఇదే రాజమండ్రి. దాంతో ఆ తరహా సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయితే చిన్నమ్మ బయటపడతారు అని అంటున్నారు.

ఇక బీజేపీలోని ఒక వర్గం ఆమె ఓటమి పాలు అయితే మాత్రం కత్తులు నూరేందుకు రెడీగా కాచుకుని కూర్చుంది అని అంటున్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం సైతం ఏపీని ఎన్నికల ఫలితాల తరువాత పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవని ఎవరో ఒకరిని ప్రెసిడెంట్ గా పెట్టి కధ నడిపిస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.