Begin typing your search above and press return to search.

రఘురామ స్వరం మారిన వేళ... తెరపైకి ఎమ్మెల్యే టిక్కెట్!!

మూడు, నాలుగు రోజుల్లో మంచి వార్త వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   4 April 2024 6:15 AM GMT
రఘురామ స్వరం మారిన వేళ...  తెరపైకి ఎమ్మెల్యే టిక్కెట్!!
X

ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన టాప్ 5 అంశాల్లో రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారా చేయరా అనే అంశం కూడా ఒకటని చెప్పినా అతిశయోక్తి కాదు! ఈయన టిక్కెట్ పై ఆ స్థాయిలో చర్చ నడుస్తుంది. అయితే... తాను పోటీ చేసే విషయం, తనకు టిక్కెట్ ఇచ్చే అంశంపై గత కొన్ని రోజులుగా పలు రకాలుగా స్పందించిన రఘురామ.. తాజాగా మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు! ఇందులో భాగంగా తెరపైకి ఎమ్మెల్యే ప్రస్థావన తెచ్చారు!

అవును... నిన్నమొన్నటివరకూ ఆరు నూరైనా నూరు ఆరైనా నరసాపురం ఎంపీ స్థానం నుంచే రఘురామ పోటీ ఉంటుందని అంటున్న వేళ... ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న రఘురామ కృష్ణంరాజు.. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాననే సంపూర్ణ విశ్వాసం తనకుందని అన్నారు. మూడు, నాలుగు రోజుల్లో మంచి వార్త వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు.

ఇక అమ్మవారిని దర్శించుకోవడానికే విజయవాడ వచ్చినట్లు తెలిపిన ఆయన... నేడు నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి వెళ్లబోతున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో... ఏ పార్టీయో తెలియదు.. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో తెలియదు కానీ.. పోటీ మాత్రం పక్కా! అని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వింటున్నట్లు తెలిపిన ఆయన... ఒకటి రెండు రోజుల్లో కూటమి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని అన్నారు!

ఇదే సమయలో పెన్షన్స్ విషయంపైనా రఘురామ స్పందించారు. వారిని సీఎం జగన్ చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో లక్షన్నర మంది సచివాలయ సిబ్బంది ఉన్నారని.. ఒక్కో వ్యక్తికీ 50 గృహాలు అప్పగిస్తే ఒక్క రోజులోనే వారంతా పెన్షన్స్ ఇచ్చేస్తారని చెప్పుకొచ్చారు! ఇదే క్రమంలో... ఒక పోస్ట్ మ్యాన్ రోజుకి ఎన్ని ఉత్తరాలు ఇస్తారో తెలుసుకోవాలని సూచించారు!

ఇదే క్రమంలో... ఎవరు ఎన్ని కారు కూతలు కూసినా తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, తనకు అలసట అనేదే లేదని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకూ నిద్రపోయేదీ లేదని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు రఘురామ కృష్ణంరాజు కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారని.. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశమయ్యారని.. ఒకటి రెండు రోజుల్లో అయాన చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుని.. అదే జిల్లాలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది! ఇక.. ట్రిపుల్ ఆర్ రానున్న ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఊపందుకుంది!