రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా...?
అది కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ గా గెలిచారు.
By: Tupaki Desk | 14 Nov 2023 3:50 PM GMTరేవంత్ రెడ్డి. రాజకీయ జీవితం కచ్చితంగా చెప్పాలీ అంటే గట్టిగా రెండు దశాబ్దాలు కూడా లేదు అని అంటారు. ఆయన 2006లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అది కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ గా గెలిచారు. ఆ మరుసటి ఏడాది అంటే 2007లో ఆయన ఎమ్మెల్సీగా కూడా ఇండిపెండెంట్ గానే గెలిచారు.
ఆ మీదట రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ టికెట్ మీద రేవంత్ రెడ్డి గెలిచారు. అదే విధంగా 2014లో కూడా టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నుంచి నెగ్గారు. అయితే సెపరేట్ తెలంగాణాలో ఆయన తన రాజకీయ గమ్యాన్ని చూసుకున్నారు. 2017లో ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. అలా 20018లో ఆయన కొండంగల్ నుంచి పోటీ చేస్తే ఓటమి మొదటిసారి ఎదురైంది.
ఇక 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఆయన గెలిచి సత్తా చాటారు. కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రమోషన్ పొందారు. ఆయన కాంగ్రెస్ లోకి వచ్చాక ఆ పార్టీలో జోష్ పెరిగింది.
గడచిన కొంతకాలంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగి అధికారానికి చేరువ అయింది. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అన్న సూచనలు కూడా ఉన్నాయి. సహజంగా పీసీసీ చీఫ్ నే చీఫ్ మినిస్టర్ గా చేస్తారు. మరి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో ఎంతమేరకు అవకాశాలు ఉన్నాయన్నది ఇపుడు ఒక చర్చగా సాగుతోంది.
ఇపుడు చూస్తే తెలంగాణాలో కాంగ్రెస్ మంచి ఊపు మీద ఉంది. ఇక రేవంత్ రెడ్డి అయితే తానే సీఎం అభ్యర్ధి అన్న స్థాయిలోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన మొత్తం తెలంగాణాలో స్టార్ కాంపెయినర్ గా తానే కలియతిరుగుతున్నారు. ఇవన్నీ చూస్తూంటే నిజంగా కాంగ్రెస్ గెలిచిన తరువాత రేవంత్ రెడ్డికి సీఎం పోస్ట్ ఇస్తారా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది.
ఎందుకంటే ఇపుడు చాలా మంది మదిలో కర్నాటక కాంగ్రెస్ ఎపిసోడ్ మెదులుతోంది. కొద్ది నెలల క్రితం అక్కడ కాంగ్రెస్ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే పీసీసీ చీఫ్ గా అక్కడ ఉంటూ కాలికి బలపం కట్టుకుని తిరిగిన డీకే శివకుమార్ సీఎం అని అంతా అనుకున్నారు. కానీ ఆయనకు ఇవ్వలేదు. సీఎల్పీ లీడర్ గా ఉన్న సిద్ధరామయ్యకే పట్టం కట్టారు.
అలా సీనియారిటీనే కాంగ్రెస్ గౌరవించింది. డీకే శివకుమార్ కి తరువాత చాన్స్ ఉంది అని హామీ ఇచ్చింది. డీకే అలా సర్దుకుని పోయారు. ఇపుడు తెలంగాణాలో అలాంటి సర్దుబాటు ఏదైనా ఉంటుందా అన్నదే అందరిలో ఆలోచనగా ఉంది అంటున్నారు.
ఇక కర్నాటకకు తెలంగాణాకు కాంగ్రెస్ విషయానికి వస్తే చాలా పోలికలు ఉన్నాయి. అక్కడ సీనియర్ నేత సిద్ధరామయ్య సీఎల్పీ లీడర్ గా ఉంటే ఇక్కడ మరో సీనియర్ నేత బలహీన వర్గానికి చెందిన నాయకుడు మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్ గా ఉన్నారు. తెలంగాణాలో సామాజిక సమీకరణలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తూ టికెట్లు ఇచ్చింది.
ఇక కీలకమైన సీఎం పోస్టు విషయంలో అదే పాటిస్తుంది అని అంటున్నారు. తెలంగాణా ఎన్నికలు ముగియగానే లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఆ ఎన్నికల్లో గెలవాలంటే కాంగ్రెస్ తన పార్టీకి గట్టి ఓటు బ్యాంక్ గా ఉన్న బలహీన వర్గాలకు పెద్ద పీట వేయాలని చూస్తుంది అంటున్నారు. ఆ విధంగా చూస్తే కనుక మల్లు భట్టి విక్రమార్కకు చాన్స్ అధికంగా ఉండొచ్చు అని అంటున్నారు.
అలా కాదని సీనియార్టీతో పాటు మరో బలమైన సామాజిక వర్గానికి చాన్స్ అనుకుంటే ఉత్తం కుమార్ రెడ్డి నుంచి చాలా మంది పేర్లు తెర మీదకు వస్తాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ల కంటే జూనియర్. పైగా ఆయన టీడీపీ నుంచి వచ్చిన వారు అని ఆయనకు చాన్స్ ఇస్తే సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆలోచనలు కూడా ఉంటాయి. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డికి సీఎం చాన్స్ ఇస్తారా లేదా అన్నది మాత్రం పెద్ద చర్చగానే ఉంది మరి.