Begin typing your search above and press return to search.

ఏపీ రాజకీయాల్లోనూ రేవంత్ చక్రం తిప్పుతారా ..

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా సీఎం పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వడం వెనక ఎన్నో వ్యూహాలు మరెన్నో ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 11:57 AM GMT
ఏపీ రాజకీయాల్లోనూ  రేవంత్ చక్రం తిప్పుతారా  ..
X

దాదాపు పదేళ్ల కాలం తరువాత కాంగ్రెస్ కి తెలుగు రాష్ట్రాలలో వెలుగు వచ్చింది. తెలంగాణాలో అధికారం ఆ పార్టీ పరం అయింది. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని ఖద్దరు పార్టీ నేతలు భావిస్తున్నారు. తమకు రాజకీయ అజ్ఞాత వాసం ముగిసింది అని కూడా తలపోస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా సీఎం పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వడం వెనక ఎన్నో వ్యూహాలు మరెన్నో ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.

తెలంగాణాలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఏపీలో పాతిక దాకా ఎంపీ సీట్లు ఉన్నాయి. రేపటి రోజున కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే సౌత్ స్టేట్స్ నుంచే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కి దక్కాలి. కాంగ్రెస్ ఇపుడు కర్నాటకలో అధికారంలో ఉంది. తెలంగాణాలో కూడా పవర్ లోకి వచ్చింది. ఈ రెండూ కలిస్తే 45 ఎంపీ సీట్లు ఉంటాయి. ఇందులో నుంచి కనీసంగా ముప్పయికి పైగా గెలవాలని కాంగ్రెస్ టార్గెట్. అంటే తెలంగాణాలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ కి దక్కేలా చూడాల్సిన బాధ్యత రేవంత్ మీద ఉంది.

అదే విధంగా ఏపీలో ఉన్న పాతిక సీట్లలో కూడా కనీసంగా కొన్ని ఎంపీ సీట్లు కాంగ్రెస్ కి తెస్తే దేశంలో ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ కి సొంతంగా సీట్లు పెరుగుతాయి. అలా చూస్తే కనుక ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాలకు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఆశాకిరణంగా మారారు అని చెప్పాలి. ఆయన రేపటి రోజున జరిగే ఎంపీ ఎన్నికల్లో ఏపీలో కూడా పర్యటించి పార్టీకి ప్రచారం చేయడమే కాదు అంగబలం అర్ధ బలం సమకూర్చాల్సి ఉంటుంది.

ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ కి ఒక్క శాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. దాన్ని పెంచాలి. అలాగే ఇతర పార్టీలతో పొత్తులకు కూడా నిర్ణయం తీసుకోవాలి. ఏపీలో తెలుగుదేశం పార్టీ అపొజిషన్ లో ఉంది. ఆ పార్టీ జనసేనతో పొత్తులో ఉంది. బీజేపీతో పొత్తు ఉంటుందో లేదో తెలియదు. మరి చంద్రబాబు పార్టీలో పనిచేసిన అనుభవం తో పాటు ఆయనకు ఒకనాడు అత్యంత సన్నిహితుడు అయిన రేవంత్ రెడ్డి ఇపుడు ఏపీ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతారా అన్న చర్చ అయితే సాగుతోంది.

తెలుగుదేశం పార్టీని ఒప్పించి 2018 తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తులకు తెర తీసిన చాతుర్యం రేవంత్ రెడ్డిదే అని చెబుతారు. ఇపుడు అదే చాకచక్యాన్ని ఏపీలో కూడా వినియోగిస్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. రేపటి రోజున జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కి కొత్త మిత్రులు కావాల్సి వస్తే అది టీడీపీ అయ్యేలా రేవంత్ చూస్తారా అన్నది కూడా మరో చర్చ.

ఇక ఏపీలో టీడీపీ ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది కూడా చూడాలి. తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను సొంతం చేసుకుని సెమీ ఫైనల్స్ లో బీజేపీ మంచి విజయం సాధించి ఊపు మీద ఉంది. 2024లో మరోసారి కేంద్రంలో బీజేపీ వచ్చేందుకు అవకాశాలు అయితే మెరుగుపడ్డాయి. దాంతో టీడీపీ ఏమని ఆలోచిస్తుంది అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది అంటున్నారు.

అయితే ఏపీ వరకూ చూస్తే బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్ల శాతం ఉంది. దాంతో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అని అంటున్నారు. దాంతో బాబు తెగించి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారా అలా ఆయనతో రేవంత్ రెడ్డి చెప్పించి ఒప్పించగలరా అన్నది ఇక్కడ కీలకమైన అంశం. ఏది ఏమైనా తెలంగాణా విజయంతో ఏపీ కాంగ్రెస్ లో కొంత కదలిక వస్తుంది అన్నది వాస్తవం. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్న వారు ఈ రోజుకీ ఆ పార్టీలో అలాగే ఉన్నారు.

అదే విధంగా చాలా జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్ నేతలుగా ఉన్న వారిలో కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ పీసీసీ చీఫ్ సాకె శైలజానాధ్ వంటి వారు ఉన్నారు. అలాగే ప్రతీ జిల్లాలో కాంగ్రెస్ కి ఎంతో కొంత క్యాడర్ ఉంది. ఇపుడు వారికి కొత్త ఉత్సాహం అందించి పొత్తుల దిశగా పార్టీని నడిపిస్తే కనీసం ఒకటో రెండో ఎంపీ సీట్లు అయినా కాంగ్రెస్ కి దక్కిస్తే రేవంత్ రెడ్డి ఏపీలో కూడా సక్సెస్ అయినట్లే అని అంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి చూపు ఏపీ వైపు పడితే మాత్రం రాజకీయాలు రసకందాయంలో పడతాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.