Begin typing your search above and press return to search.

పేరులో తుక్కు.. కాంగ్రెస్ కు బంగారం.. అచ్చొచ్చిన చోట.. లోక్ సభ శంఖారావం

ఆ సభ ఊపును చూసే ఇక కాంగ్రెస్ పార్టీదే అధికారం అని నిర్ధారణ అయింది

By:  Tupaki Desk   |   23 March 2024 11:30 PM GMT
పేరులో తుక్కు.. కాంగ్రెస్ కు బంగారం.. అచ్చొచ్చిన చోట.. లోక్ సభ శంఖారావం
X

ఆ గ్రామం పేరులో ‘తుక్కు’ అని ఉండొచ్చు.. కానీ, ఓ పార్టీకి అది బంగారంతో సమానం. పదేళ్లుగా అధికారానికి దూరమై దిక్కుతోచని స్థితిలో ఉన్న వేళ ఆ గ్రామంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రజల్లోకి వెళ్లింది. ఆ సభ ఊపును చూసే ఇక కాంగ్రెస్ పార్టీదే అధికారం అని నిర్ధారణ అయింది. అందుకే మరోసారి ఆ గ్రామాన్నే నమ్ముకుంది.

మళ్లీ అక్కడే విజయ భేరి

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుందని ఎవరూ ధీమాగా చెప్పలేని పరిస్థితి. అలాంటి సమయంలో తుక్కగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభ అత్యంత విజయవంతమైంది. సభ జరిగిన తీరు కంటే ప్రజల హాజరు, సభకు మీడియాలో దక్కిన కవరేజీ, సాధారణ ప్రజలు కనబర్చిన ఆసక్తి కీలకంగా మారాయి. దీంతోనే తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు మొదలయ్యాయి. అందులోనూ ఆ సభలో కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ పాల్గొనడం.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం చరిత్రలో నిలిచిపోయింది. ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది.

ఏప్రిల్ మొదటివారంలో..

ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ముంగిట తెలంగాణ కాంగ్రెస్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు పలువురు జాతీయ ముఖ్యనాయకులు హాజరవుతారు. ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను తెలుగులో తుక్కుగూడ సభలో ఖర్గే విడుదల చేయనుండడం గమనార్హం. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తున్న ఈ సభ నుంచే కాంగ్రెస్ ప్రచారాన్ని మొదలుపెట్టనుంది. కాగా, తుక్కుగూడ సభపై తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇతర ముఖ్య నాయకులు కలిసి నిర్ణయం తీసుకున్నారు.

సోనియా వస్తారా?

తుక్కుగూడ సభకు సోనియాగాంధీ వస్తారా? అనేది సంశయమే. అనారోగ్యం రీత్యా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే సభలకు హాజరయ్యే చాన్సుంది. అయితే, తుక్కుగూడ సభకు వస్తారా? లేదా? అనేది చూడాలి.