Begin typing your search above and press return to search.

తెలంగాణా పొలిటికల్ స్లాట్ లోకి టీడీపీ ?

ఆ వాక్యూమ్ లేనపుడు ఎంతటై పెద్ద వారు రాజకీయం చేసినా రిజల్ట్ ఘోరంగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   10 Aug 2024 7:30 PM GMT
తెలంగాణా పొలిటికల్ స్లాట్ లోకి టీడీపీ ?
X

రాజకీయాల్లో అందరూ అనుకుంటే సక్సెస్ కాలేరు. సక్సెస్ కావాలీ అంటే దానికి ఒక లెక్క ఉంది. వ్యూహాలు ఉండాలి. అవి అనుకూల సమయాలలో వేస్తేనే పండుతాయి. అలాగే కావాల్సినంత పొలిటికల్ వాక్యూమ్ ఉండి తీరాలి. ఆ వాక్యూమ్ లేనపుడు ఎంతటై పెద్ద వారు రాజకీయం చేసినా రిజల్ట్ ఘోరంగా ఉంటుంది.

తెలంగాణాలో ఇపుడు అలాంటి రాజకీయ శూన్యత ఏర్పడింది అని టీడీపీ భావిస్తోంది. దానికి కారణం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాజకీయ విస్తరణ కాంక్ష అంతా బీఆర్ ఎస్ మీదనే చూపిస్తూ టార్గెట్ చేస్తోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నడూ లేనంతగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. దాంతో బీఆర్ఎస్ వేగంగా తగ్గిపోతోంది.

అందులో ఉన్న వారిలో అత్యధికులు టీడీపీ నుంచి వెళ్ళిన వారే. వారిలో అనేక మంది మరో దారి లేక కాంగ్రెస్ లో చేరుతున్నారు. వారికి సరైన రాజకీయ భరోసా ఇస్తే కనుక టీడీపీ లాంటి పార్టీలో చేరవచ్చు అని అంటున్నారు. టీడీపీకి తెలంగాణాలో అధికారం అందుకున్న చరిత్ర ఉంది. చంద్రబాబు లాంటి ధీటైన నాయకత్వం ఉంది. ఏపీలో అధికారంలో ఉండడం కేంద్రంలోని ఎన్డీయే కీలకంగా ఉండడంతో తెలంగాణాలో టీడీపీ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు చూస్తోంది.

ముందుగా తెలంగాణాలో భారీ ఎత్తున పార్టీ సభ్యత్వం చేపట్టాలని నిర్ణయించింది. దీని ద్వారా తెలంగాణాలోని మారు మూల గ్రామాల దాకా పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది ఒక అంచనాకు వస్తుంది అని అంటున్నారు. ఆ తరువాత స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తన రాజకీయ బలాన్ని చటుకునే ప్రయత్నం చేస్తుంది అని అంటున్నారు.

తెలంగాణాలో రెండు జాతీయ పార్టీలు ఇపుడు జోరు మీద ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంటే విపక్షంలోకి బీజేపీ వచ్చింది. అయితే ఎల్లప్పుడూ ఈ రకమైన రాజకీయాలు ఉండే చాన్స్ లేదు. దాంతో ప్రాంతీయంగా కూడా ఉన్న పార్టీలను జనాలు చూస్తారు. తెలంగాణా సెంటిమెంట్ అన్నది అంతర్లీనంగా ఉన్నప్పటికి ప్రజలు అతీతంగా రాజకీయాలు చూస్తారు అన్నది కూడా రుజువు అవుతూ వస్తోంది.

పైగా టీడీపీ రాజకీయం చేసినా ఆ పార్టీ తెలంగాణా నాయకులనే ముందు పెడుతుంది కాబట్టి వారితోనే అంతా సాగుతుంది కాబట్టి ఏ ఇబ్బందీ లేదు అని భావిస్తోంది. గతంలోలా కొందరు తమ రాజకీయ పబ్బం కోసం తెలంగాణా సెంటిమెంట్ ని ఎగోదోసి లబ్ది పొందే వాతావరణం ఉండదని భావిస్తున్నారు. ఈ క్రమంలో చూస్తే కనుక టీడీపీకి ఇది పునరుజ్జీవానికి మంచి చాన్స్ అని అంటునారు.

అందుకే చంద్రబాబు తెలంగాణా ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. తాము తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దానికి అనుగుణంగా రాజకీయం చేస్తామని అంటున్నారు. ఇక హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడుదుడుకులను చూసిందని అన్నారు. అలాగే అప్రతిహత విజయాలు అందుకుందని అన్నారు.

ఇద్దరు ముఖ్యమంత్రులను తెలంగాణాకు అందించిన ఘనత టీడీపీదే అని కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీ అసలు పుట్టిందే తెలంగాణా గడ్డ మీద అని బాబు టీడీపీకి ఆ గడ్డతో ఉన్న కనెక్షన్ ని గుర్తు చేశారు. టీడీపీని మరింతగా బలోపేతం చేస్తామని బాబు స్పష్టం చేసారు.

ఏపీ తెలంగాణాలలో ఒకేసారి సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని అన్నారు. అది కనుక పూర్తి అయితే పార్టీ కమిటీలు వేస్తామని అన్నారు. తొందరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తానని కూడా బాబు అన్నారు

ఇక గత ఏడాది జరిగిన తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడానికి కారణం కొన్ని ప్రత్యేక పరిస్థితులు అని బాబు అన్నారు. అలాగే బలంగా ఉన్న టీడీపీ కేవలం కొన్ని కారణాల వల్ల తెలంగాణలో బలహీనపడిందని పేర్కొన్నారు. అంతే కాదు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తానికి సమరోత్సాహంతో బాబు ఉన్నారు. దాంతో తెలంగాణాలో టీడీపీకి గత వైభవం దక్కుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.