Begin typing your search above and press return to search.

అన్న క్యాంటీన్‌.. మంచీ చెడులు.. బాబు తెలుసుకోవాలి..!

దీనికిగాను ప్ర‌భుత్వం కూడా.. రూ.200 కోట్ల వ‌ర‌కు ఏటా భారం భ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 Aug 2024 2:30 PM GMT
అన్న క్యాంటీన్‌.. మంచీ చెడులు.. బాబు తెలుసుకోవాలి..!
X

రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా పేద‌ల‌కు క‌డుపు నింపాల‌న్న ల‌క్ష్యంతో కూట‌మి స‌ర్కారు క్యాంటీన్ల‌ను ప్రారంభించింది. శుక్ర‌వారం రాష్ట్రంలో 99 క్యాంటీన్ల‌ను కూడా ప్రారంభించ నున్నారు. రూ.15కే పేద‌ల‌కు ఉద‌యం టిఫిన్‌, మ‌ధ్యాహ్నం, రాత్రి వేళ‌ల్లో భోజ‌నాలు అందించాల‌నేది ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం. దీనికిగాను ప్ర‌భుత్వం కూడా.. రూ.200 కోట్ల వ‌ర‌కు ఏటా భారం భ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఎంత చీప్‌గా వేసుకున్నా.. ఉద‌యం టిపిన్ రూ.20, మ‌ధ్యాహ్నం భోజ‌నం 40, రాత్రి భోజ‌నం 40 ప‌డుతుంద‌ని అనుకున్నా.. రోజుకు రూ.100.

కానీ, ప్ర‌జ‌ల నుంచి తీసుకుంటున్న మొత్తం మాత్రం రూ.15. దీంతో మిగిలిన 85 రూపాయ‌ల‌ను కార్పొరేష న్లు, లేదా మునిసిపాలిటీలు భ‌రించాలి. అలానే ప్ర‌భుత్వం కూడా.. నెత్తిన వేసుకోవాలి. ఇదొక ఆర్థిక భార‌మే అయినా.. దీనిని సంతోషంగా భ‌రించేందుకు రెడీగానే ఉన్నామ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా పేద‌లంతా సంతోషంగా ఉంటార‌ని కూడా తెలిపారు. అయితే.. అన్న క్యాంటీన్ల ఏర్పాటు మంచిదే అయినా.. దీని వ‌ల్ల ఎంత మంచి ఉన్నా.. అదేస‌మ‌యంలో కొన్ని స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి.

వాటిని కూడా కూట‌మి ప్ర‌బుత్వం ప‌ట్టించుకుని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయాలి. దీనిలో ప్ర‌ధానంగా.. రోడ్డున ప‌డుతున్న కార్మికులు. ఔను! నిజం. ఆహ్వార త‌యారీ రంగంలో ఇప్పుడు ఉద‌యం పూట టిఫిన్ బ‌ళ్లు పెట్టుకుని.. ఇళ్ల‌లోనే త‌యారు చేసి విక్ర‌యిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. రోడ్డుకు రెండు మూడు అంగ‌ళ్ల‌యినా క‌నిపిస్తాయి. ఇక్క‌డ రూ.20 నుంచి రూ.25 మ‌ధ్య వారు టిఫిన్ ఇస్తున్నారు. ఇలా విక్ర‌యిస్తున్న కుటుంబాలు.. వాటినే జీవ‌నాధారంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయి.

ఇప్పుడు ఆ చిన్న‌పాటి చిరు వ్యాపారాల‌పై అన్న క్యాంటీన్ల ప్ర‌భావం ప‌డుతుంది. దీంతో ఆయా కుటుంబా ల ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డ‌డం ఖాయమ‌నే వాద‌న వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 50 ల‌క్షల‌కు పైగానే కుటుంబాలు.. ఇలా చిరు వ్యాపారాల‌పైనే ఆధార‌ప‌డ్డాయి. ఉభ‌య గోదావ‌రి జిల్లాలా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దీనిని నిర్వ‌హిస్తూ కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ల రాక‌తో ఇవి దెబ్బ‌తిన‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇలాంటివారిని ఆదుకునే ప‌రిస్థితి దిశ‌గా అడుగులు వేయాలి.