ఎన్నికలపై "వివేకా హత్య" ప్రభావం... తెరపైకి రెండు విశ్లేషణలు!
అవును... ఈ ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్య కేసు ప్రభావం ఏ మేరకు ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. దీంతో... రెండు రకాల విశ్లేషనలు తెరపైకి వస్తున్నాయి.
By: Tupaki Desk | 30 April 2024 6:34 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. దాదాపు మరో పదిరోజుల్లో ప్రచార పర్వాలు ముగియబోతున్నాయి.. మైకులు మూగబోబోతున్నాయి! దీంతో.. ఏపీలో ఎన్నికల ప్రచారాల్లో క్లైమాక్స్ సందడి నెలకొంది. ఈ సమయంలో తన పరిపాలనలో మంచి జరిగితేనే ఓటు వేయమని సీఎం జగన్ కోరుతుండగా.. జగన్ వల్ల ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని కూటమి చెబుతుంది!
దీంతో... 2014 నుంచి 2019 వరకూ గ్రాఫిక్స్ లో కాకుండా నిజంగా జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలని వైసీపీ ప్రశ్నిస్తుంది. ఇదే క్రమంలో... నిజంగా నాడు అంత అభివృద్ధి జరిగిపోయి ఉంటే... అటువంటి పాలనే మరోసారి అందిస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడిగే దమ్ముందా అని కూటమికి సవాల్ చేస్తుంది. నాటి మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అని నిలదీస్తుంది.
ఎన్నికల వేళ ఈ విధంగా ఏపీలో అధికార వైసీపీ.. విపక్ష కూటమి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తుంది! కొన్ని సందర్భాల్లో ఇది తీవ్ర స్థాయికి చేరి.. ప్రజలకు ఏమాత్రం అవసరం లేని వ్యక్తిగత విమర్శలకూ దారి తీస్తుంది. ఆ సంగతులు అలా ఉంటే... ఈ సమయంలో వైఎస్ వివేకా హత్య వ్యవహారం ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపబోతుందనేది అసక్తిగా మారింది.
అవును... ఈ ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్య కేసు ప్రభావం ఏ మేరకు ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. దీంతో... రెండు రకాల విశ్లేషనలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... హత్య జరిగింది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అయినప్పటికీ... గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్నది జగనే కాబట్టి.. ఇప్పటివరకూ సర్కార్ నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయిందనే ప్రశ్నలు విపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
ఇదే క్రమంలో... కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిళ పోటీ చేస్తున్న నేపథ్యంలో... ఆమెతో పాటు వివేకా కుమార్తె సునీత కలిసి ఈ విషయంపై జగన్ & కో పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు! మర్డర్ కేసుల్లో ముద్దాయిలకు ఓట్లు వేయొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు! దీంతో... ఈ ఎన్నికల్లో కొన్ని చోట్లయినా వివేకా హత్య వ్యవహారం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఒక విశ్లేషణ నడుస్తుంది.
మరోపక్క... ఏపీలో జగన్ సర్కార్ పనితీరుకూ, వివేకా మర్డర్ కేసుకూ ఉన్న సంబంధం ఏమిటి అనే విశ్లేషణా వినిపిస్తుంది. ఆ హత్య జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో!.. ఆ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తుంది.. కోర్టు విచారణ చేస్తుంది.. అందులో జగన్ ప్రయేయం ఎక్కడుంది? పైగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కలిసి కూటమిగా ఏర్పడింది టీడీపీ అని గుర్తుచేస్తున్నారు!
ఇదే సమయంలో.. వివేకా హత్య కేసును బూచిగా చూపించి జగన్ సర్కార్ పై బురదజల్లి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతో కాకుండా... ప్రజల మెప్పు పొందడానికి, వారిని ఒప్పించడానికి మరో రకంగా ప్రయత్నించాలని.. ప్రజలు కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తారని అంటున్నారు.
కాగా... వివేకా హత్యపై మాట్లాడొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఎన్నికల ప్రచా కార్యక్రమాల్లో ఆ విషయాన్ని ప్రస్థావించడం తగ్గింది!! మరి ఈ ఎన్నికల్లో పైన చెబుతున్న రెండు విశ్లేషణల్లోనూ దేని ప్రభావం ఉండబోతుందనేది వేచి చూడాలి!!