సాయం చేయలేదా? అన్న జగన్ మాటకు మహిళ ఆన్సర్ వైరల్
దీనికి సదరు మహిళ స్పందిస్తూ.. "ప్రతి ఇంటి దగ్గర పీకల్లోతు నీళ్లున్నాయి. వాళ్లు అయినా ప్రతి ఇంటికి ఎలా వస్తారు? కొంతమందికి సరుకులు పంచారు.
By: Tupaki Desk | 3 Sep 2024 4:45 AM GMTవిజయవాడను ముంచెత్తిన వరదల వేళ.. బాధితుల కష్టాలు ఒకవైపు.. సహాయక చర్యలు మరోవైపు.. రాజకీయం ఇంకోవైపు నడుస్తున్నాయి. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో వైసీపీ అధినేత సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా నడుము లోతు నీళ్ల వరకున్న ప్రాంతాల్లోనూ నడుస్తూ.. అక్కడి వారిని పరామర్శించే ప్రయత్నం చేశారు. మొత్తంగా వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆయన కొందరు బాధితులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక ప్రశ్నకు.. స్థానిక మహిళ ఒకరు ఇచ్చిన సమాధానం ఆయన్ను ఇబ్బంది పెట్టేదిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. విజయవాడలోని సింగ్ నగర్ కు చెందిన ఒక మహిళను.. వైసీపీ అధినేత జగన్ ప్రశ్నిస్తూ.. "ఏమ్మా.. మీకు ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు అందుతున్నాయా? అని అడిగారు.
దీనికి సదరు మహిళ స్పందిస్తూ.. "ప్రతి ఇంటి దగ్గర పీకల్లోతు నీళ్లున్నాయి. వాళ్లు అయినా ప్రతి ఇంటికి ఎలా వస్తారు? కొంతమందికి సరుకులు పంచారు. నీళ్లలో మునుగుతూ మా వద్దకు వచ్చి.. పడవ సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు" అని బదులిచ్చారు. ఈ ఊహించని సమాధానం జగన్ ను కాస్తంత ఇబ్బందికి గురి చేసింది.
విజయవాడ వరద ముంపునకు చంద్రబాబు ప్రభుత్వమే కారణమని.. మనిషి చేసిన తప్పిదానికి ప్రజలు ఇంత భారీగా ఇబ్బంది పడుతున్నట్లుగా జగన్ విమర్శించిన సంగతి తెలిసిందే. గతంలో భారీగా వర్షాలు కురిసినా.. ఎప్పుడూ విజయవాడ ఇంతలా మునిగిపోలేదన్న ఆయన.. ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపే ప్రయత్నం కన్నా.. విమర్శలు చేయటమే లక్ష్యంగా వ్యవహరించిన వైనం అందరూ మాట్లాడుకునేలా చేసింది. కష్టంలో ఉన్న వారిని పరామర్శించేందుకు వచ్చే వేళలో.. వారికి అంతో ఇంతో సాయం చేస్తూ ఉంటే బాగుండేదని.. అందుకు భిన్నంగా విమర్శల్ని మాత్రమే సంధిస్తూ.. బాధితుల బాధల్ని.. ఇబ్బందుల్ని రాజకీయంగా మార్చటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.