Begin typing your search above and press return to search.

ఆమె గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. దేవుడా ఎందుకిలా?

కొన్ని ఉదంతాల గురించి తెలిసినంతనే మనసు చేదుగా మారుతూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   27 Aug 2024 11:30 AM GMT
ఆమె గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. దేవుడా ఎందుకిలా?
X

కొన్ని ఉదంతాల గురించి తెలిసినంతనే మనసు చేదుగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తావించే మహిళ కూడా ఆ కోవలోకే వస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలీ లాహే అనే మహిళ చేసిన ప్రకటన గురించి తెలిసినంతనే.. ఇదేంటి ఇలా? అనుకోవచ్చు. కానీ.. ఒక్కసారి ఆమె గురించిన విషయాలుతెలిసిన తర్వాత మాత్రం అయ్యో అన్న మాట నోటి నుంచి రావటమే కాదు.. కంటి వెంట కన్నీళ్లు ఖాయం.

ఆస్ట్రేలియా రాజధాని మెల్ బోర్న్ నివాసి అయిన ఆమె సోషల్ మీడియాలో చర్చగా మారారు. ‘నాతో గడిపేందుకు కొత్త వ్యక్తులు ఉంటే రండి. నాతో గడిపే సమయానికి వేలంలో గెలుచుకోండి’ అనే ఎమిలీ మాటలు కాస్తంత కొత్తగా.. వింతగా ఉంటాయి. కానీ.. అసలు విషయం తెలిసిన తర్వాత ఆమె నిర్ణయాన్ని వంక పెట్టలేం సరికదా.. పట్టించుకోని ప్రభుత్వం మీద ఆగ్రహం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంతకూ ఆమె ఎవరు? ఏం చేస్తుంటారు? ఆమెకు ఏమైంది? ఆమె సమయాన్ని ఎందుకు వేలం వేస్తున్నారు? కొత్త వాళ్లతో టైం స్పెండ్ చేయటానికి అంత ఆసక్తి చూపిస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

ఎమిలీ లాహే మధ్య వయస్కురాలు. ఆరోగ్యకరమైన జీవశైలిని ఫాలో అయ్యేవారు. ప్రతి రోజూ ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం పరిగెత్తేది. చెడు అలవాట్లకు దూరంగా ఉండేది. అలాంటి ఆమెకు.. కొన్నేళ్ల నుంచి సైనసైటిస్.. తలనొప్పితో ఇబ్బంది పడే వారు. తర్వాతి కాలంలో ఆమె చూపు తగ్గటం మొదలైంది. దీంతో కంగారు పడ్డ ఆమె.. ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించింది. ఆ రిపోర్ట్స్ ను చూసిన వైద్యులు.. ఆమెకు అరుదైన ‘‘నట్ కార్సినోమా’’ కేన్సర్ బారిన పడినట్లుగా గుర్తించారు. శరీరంలో మెడ.. తల.. ఊపిరితిత్తుల్లో ఎక్కడైనా రావొచ్చు. చికిత్సకు లొంగని కేన్సర్ కావటంతో దీన్ని టెర్మినల్ కేన్సర్ గా చెబుతుంటారు. తగినంత చికిత్స చేయలేని వ్యాధి అని దీని అర్థం.

తాను అరుదైన కేన్సర్ బారిన పడినట్లు తెలిసినంతనే ఆమెకు వర్తమానం ఎంత ముఖ్యమైనదన్న విషయం అర్థమైంది. ఏ రోజుకు ఆ రోజే బతికే పరిస్థితి. రేపు అనేది ఉంటుందా? లేదా? అన్నది సందేహమే. ఆయుర్ధాయం ఎంతన్నది తెలియని పరిస్థితుల్లో.. ఆమె తన జీవితంలోని ప్రతి రోజును అస్వాదించాలని భావించింది. అందుకే.. ప్రతి రోజూ కొత్త వాళ్లను కలవాలని.. వారితో సమయాన్ని గడపాలని.. కొత్త విషయాల్ని తెలుసుకోవాలని భావించింది.జీవితంలోని ప్రతి క్షణాన్ని అస్వాదించాలన్నదే ఆమె లక్ష్యం. అందుకే ఆమె తన సమయాన్ని వేలం వేసి.. కొత్త వాళ్లను గడపాలని డిసైడ్ అయ్యారు. ఆమె ఆరోగ్యం మీద ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకున్నది లేదు. ఒకవేళ.. ప్రభుత్వం కనుక ప్రత్యేకంగా ఫోకస్ చేసి.. ఖరీదైన వైద్యం చేయించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ.. అలాంటిదేమీ జరగలేదు.

అందుకే బతికే ప్రతిరోజును తీపి గురుతులతో నింపుకోవాలని.. తనకున్న కొద్ది రోజుల్ని మిస్ చేసుకోకూడదని భావించింది. ఆమె గురించి మొత్తం తెలిసిన వారంతా అయ్యో అనుకోకుండా ఉండలేరు. అంతేకాదు.. కేన్సర్ వ్యాధులపై మరింత పరిశోధనలు చేసే ప్రాధాన్యతను.. ప్రాముఖ్యతను తన మాటలతో చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. తన మాదిరి మరొకరు తమ జీవితాన్ని అర్థాంతరంగా ముగించాలని ఆమె కోరుకోవటం లేదు. ఆరోగ్య సంస్థల లెక్కల ప్రకారం కేన్సర్ మనుగడ రేటు కేవలం 50 శాతమే. కానీ.. 2010 వచ్చేసరికి మాత్రం అది కాస్తా 70 శాతంగా మారింది. కొన్ని కేన్సర్లకు అయితే బాధితులు ఐదేళ్లకు పైగా జీవిస్తున్న పరిస్థితి. అందుకే.. ఆమె కేన్సర్ మీద మరింత పరిశోధన జరగాలని కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు చెప్పండి.. ఆమె తన సమయాన్ని వేలం వేయటంలో ఎంత అర్థముందో కదా?