ఏపీలో పోస్టాఫీసుల వద్ద ఏమిటీ బారులు?
ఎవరైనా నాయకుడు కానీ, మరేదైనా పోస్టు రూపంలో కానీ ఒక విషయం వెలుగులోకి వచ్చిందంటే
By: Tupaki Desk | 29 Nov 2024 7:02 AM GMTఇటీవల కాలంలో అసలైన ప్రచారం కంటే దుష్ప్రచారమే ఎక్కువగా ఫేమస్ అవుతుందని.. అలాంటి వాటి విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పనికి ప్రజలు పూనుకోవడం లేదనే చర్చ వినిపిస్తుంది. ఎవరైనా నాయకుడు కానీ, మరేదైనా పోస్టు రూపంలో కానీ ఒక విషయం వెలుగులోకి వచ్చిందంటే.. అందులో సాధ్యాసాధ్యాలు, వాస్తవాస్తవాల గురించిన ఆలోచన తగ్గుతుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో అంధ్రప్రదేశ్ లో ఓ కీలక పరిణామం తెరపైకి వచ్చింది. కొంతమంది చేసిన దుష్ప్రచారం వల్ల జనాలు పోస్టాఫీసుల వద్ద బారులు తీరారు. బ్యాంకుల్లో ఖాతాలు లేనివారి గురించిన ప్రకటనలో స్పష్టత కరువైందో.. లేక, దుష్ప్రచారం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందో కానీ... ఏపీలో మహిళలు గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నట్లుగా పోస్టాఫీసులకు పరుగులు తీశారు!
అవును.. బ్యాంకుల్లో ఇప్పటివరకూ పొదుపు ఖాతాలు లేనివారు.. ఖాతాలు ఉండి ఆధార్ అనుసంధానం చేయని వారు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్నవారు.. సమీప పోస్టాఫీసులో అకౌంట్స్ ఓపెన్ చేయాలంటూ అధికారుల ఆదేశాలతో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులకు వెళ్తున్నారు. ఈ మేరకు గత రెండు రోజులుగా ఇదే జరుగుతుందని అంటున్నారు.
ఇప్పటికే పోస్టాఫీసుల్లో అకౌంట్స్ ఉంటే జాతీయ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీ.సీ.ఐ)తో అనుసంధానం చేసుకోవాలనే సూచనతోనూ పోస్టాఫీసులకు పోటెత్తుతున్నారు. అయితే... ఈ విషయంలో కొంత దుష్ప్రచారం జరిగిందని అంటున్నారు. దీంతో... ఇప్పటికే బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నవారు కూడా పోస్టాఫీసుల వద్ద క్యూకట్టారు!
దీంతో... ఏపీలోని పలు ప్రాంతాల్లో పోస్టాఫీసుల ఎదుట పెద్ద సంఖ్యలో మహిళలు బారులు తీరారు. ఈ మేరకు రూ.200 వెచ్చించి అకౌంట్ తెరిచేందుకు పిల్లాపాపలతో సహా వచ్చి క్యూలు కట్టిన పరిస్థితి. దీంతో... ఎన్నడూ లేనివిధంగా అన్నట్లుగా ఒక్కసారిగా పలు ప్రాంతాల్లోని పోస్టాఫీసులు కిక్కిరిసిపోయాయని చెబుతున్నారు.
ఈ సందర్భంగా మరోసారి అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా... ఇప్పటికే బ్యాంక్ అకౌంట్స్ ఉండి, వాటితో సంక్షేమ పథకాల కింద సాయం అందుకుంటున్నవారు తిరిగి కొత్తగా పోస్టాఫీసుల్లో అకౌంట్స్ తెరవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని.. పోస్టాఫీసులకు రావాలని సూచిస్తున్నారని తెలుస్తోంది.