Begin typing your search above and press return to search.

రంగంలోకి షీ-బాక్స్..కామాంధుల ఆట‌క‌ట్టేలా!

ఇండ‌స్ట్రీ జ‌నాల్ని ప‌క్క‌న బెడితే సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల రూపంలో ప్ర‌జ‌లంతా బాధిత‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 Aug 2024 6:35 AM GMT
రంగంలోకి షీ-బాక్స్..కామాంధుల ఆట‌క‌ట్టేలా!
X

మ‌ల‌యాళ ఇండస్ట్రీని జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక షేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాధిత మ‌హిళ‌లంతా మీడియా ముందుకొచ్చి త‌మ బాధ‌ను చెప్పుకోవ‌డంతో స‌న్నివేశం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. రోజు రోజుకి బాధిత మ‌హిళ‌ల‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇండ‌స్ట్రీ జ‌నాల్ని ప‌క్క‌న బెడితే సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల రూపంలో ప్ర‌జ‌లంతా బాధిత‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు.

స్పందించాలి అనుకున్న సెల‌బ్రిటీలు ధైర్యంగా త‌మ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఖుష్బూ, స‌మంత స‌హా ప‌లువురు ప్ర‌ముఖ న‌టీమ‌ణులు ఇప్ప‌టికే ఓపెన్ గా మాట్లాడిన సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే రాష్ట్ర ఫ‌రిధిలో ఆక‌తాయిల ఆట క‌ట్టించేలా షీటీమ్స్ స్పందిస్తున్నాయి. మ‌హిళ‌ల ఫిర్యాదుతో షీటీమ్స్ రంగంలోకి దిగి తాట తీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు కేంద్రం షీ-బాక్స్‌ అనే పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌ను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవీ ప్రారంభించారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల ఇబ్బందులపై జస్టిస్‌ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక చర్చకు దారితీసిన నేపథ్యంలో కేంద్రం ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. లైంగిక వేధింపులపై అందే ఫిర్యాదుల పరిష్కారం ద్వారా మహిళల భద్రతకు ఈ పోర్టల్‌ ఉపయోగపడుతుంది. షీ బాక్స్‌ పోర్టల్‌ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీలు, స్థానిక కమిటీలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు అనుసంధానమై ఉంటుంది.

నోడల్‌ అధికారి ఫిర్యాదులకు సంబంధించిన పరిష్కారాలను పర్యవేక్షిస్తుంటారు. ఫిర్యాదుల నేప‌థ్యంలో త‌క్ష‌ణ‌మే అనుసంధాన‌మైన టీమ్ చ‌ర్య‌ల‌కు దిగుతుంద‌ని తెలుస్తోంది. అంటే సినీ ప‌రిశ్ర‌మ స‌హా మ‌హిళ‌లు ప‌నిచేసే ప్ర‌తీచోటా త‌మ‌కు లైంగికంగా ఆప‌ద పొంచి ఉంద‌ని గ్ర‌హిస్తే వెంట‌నే ఫిర్యాదు చేయోచ్చు అన్న మాట‌.