Begin typing your search above and press return to search.

పారిస్ ఒలింపిక్స్ అనేక ప్రత్యేకతలు అంతకుమించిన విశిష్టతలు

ప్రపంచంలోని అన్ని దేశాలు పాల్గొనే ఏకైక క్రీడా సంగ్రామం ఒలింపిక్స్.

By:  Tupaki Desk   |   27 July 2024 11:33 AM GMT
పారిస్ ఒలింపిక్స్ అనేక ప్రత్యేకతలు అంతకుమించిన విశిష్టతలు
X

‘‘పాల్గొనడమే ప్రధానం.. పతకం కాదు’’.. పైకి సాధారణ వ్యాఖ్యలాగా అనిపించినా.. దీనిని లోతుగా చూస్తే ఎంతో అర్థం ఉంది. నీ ప్రయత్నం నువ్ చెయ్.. ఫలితాన్ని భగవంతుడికి వదిలెయ్.. ఒక్క అడుగు ముందుకు వేస్తేనే వెయ్యి మైళ్ల దూరాన్ని చేరుకోగలం.. ఇలాంటి ప్రేరణ కలిగించే మాటలన్నింటికీ పై వాక్యమే ఆదర్శం అనుకోవాలేమో..? ఇదంతా ఒలింపిక్స్ గురించి. ప్రపంచంలోని అన్ని దేశాలు పాల్గొనే ఏకైక క్రీడా సంగ్రామం ఒలింపిక్స్. ఇలాంటి క్రీడలకు ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఆతిథ్యం ఇస్తోంది.

రికార్డు స్థాయిలో మూడుసార్లు ఆతిథ్యం..

అమెరికాలోని లాస్ ఏజెంల్స్ నుంచి జపాన్ లోని టోక్యో వరకు ప్రపంచ పటంలోని చాలా నగరాలు ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చాయి. అయితే, గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే నిర్వహించాయి. కానీ, పారిస్ మాత్రం మూడోసారి ఒలింపిక్స్ కు వేదికైంది. ప్రపంచంలో మరే నరానికీ ఈ రికార్డు ఇంతవరకు దక్కలేదు.. బహుశా దక్కబోదు అంటే ఆశ్చర్యమే.

వందేళ్ల తర్వాత..

చాలా నగరాల్లో 20, 30 ఏళ్లలో రెండోసారి ఒలింపిక్స్ నిర్వహించి ఉండొచ్చు. కానీ.. పారిస్ మాత్రం వందేళ్ల తర్వాత నిర్వహిస్తుండడమే ఇక్కడ విశేషం. ఎంత ఫ్యాషన్ రాజధాని అయినా.. వందేళ్ల గ్యాప్ రావడం ఆశ్చర్యమే కదూ.. పారిస్ చివరిసారిగా 1924లో ఒలింపిక్స్ కు వేదికైంది. అయితే, తొలిసారిగా 1900 సంవత్సరంలోనూ పారిస్ లో ఒలింపిక్స్ జరిగాయి. అంటే.. 24 ఏళ్లలోపే రెండోసారి ఆతిథ్యం ఇచ్చింది.మూడోసారికి మాత్రం వందేళ్లు పట్టింది.

లింగ సమానత్వం.. ఐఫిల్ టవర్ ఇనుము

ఈసారి ఒలింపిక్స్ ప్రత్యేకత పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్లు పోటీ పడుతుండడం. 5,630 మంది పురుషులు, 5416 మంది మహిళలు ఉన్నారు. దీనిపి ఒలింపిక్స చరిత్రలో లింగ సమానత్వం సాధించిన తొలి టోర్నీగా పిలుస్తున్నారు. ఇక ఈ పోటీలకు ఇచ్చే పతకాలను ప్రఖ్యాత ఐఫిల్ టవర్ రెనోవేషన్ లో వెలికితీసిన ఇనుముతో తయారు చేశారు. ప్రతి పతకంలో 18 గ్రాముల ఈ ఇనుము ఉంటుందట. బోట్లలో అథ్లెట్ల పరేడ్ కూడా తొట్ట తొలిసారి.

మహిళలకు.. భారత్ కు పారిస్ లోనే..

1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్ భారత్ కు తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. 124 ఏళ్ల కిందట భారత్ తొలిసారి పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నదనమాట. అప్పటికి బ్రిటిష్ పాలనలో ఉంది. ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ 10 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తోంది. అంతేకాదు.. 1900 ఒలింపిక్స్ నుంచే మహిళలు పాల్గొనడం మొదలైంది. 5 అంశాల్లో 22 మంది అతివలు పాల్గొన్నారు. తొలి ఒలింపిక్స్ 1896లో గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో జరగ్గా.. రెండోది పారిస్ లో జరిగింది.

ఒలింపిక్స్ లో మహిళల ప్రాతినిధ్యం 1976 వరకు 20 శాతం లోపే. 2020 నాటికి అది 48 శాతానికి పెరగడం గమనార్హం. ఇప్పుడు పారిస్ లో సరి సమానం అయ్యారు.