Begin typing your search above and press return to search.

మాజీ సీఎంల బిడ్డలు.. ఏపీలో 2 జాతీయ పార్టీలకూ మహిళలే చీఫ్ లు

దీనిలో కుదిరితే బీజేపీ. వీటి మధ్యలో వైఎస్ షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తు వేసింది.

By:  Tupaki Desk   |   17 Jan 2024 2:30 AM GMT
మాజీ సీఎంల బిడ్డలు.. ఏపీలో 2 జాతీయ పార్టీలకూ మహిళలే చీఫ్ లు
X

ఏపీలో మరొక్క మూడు-నాలుగు నెలల్లో జరగబోయే ఎన్నికలు అత్యంత హోరాహోరీగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఓ వైపు డెవలప్ మెంట్, సంక్షేమంతో వైఎర్టీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరోవైపు ఆయన పాలనను తీవ్రంగా ఎండగడుతూ ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి. దీనిలో కుదిరితే బీజేపీ. వీటి మధ్యలో వైఎస్ షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తు వేసింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే.. 70 ఏళ్ల చరిత్రలో ఏపీసీసీకి తొలి మహిళా అధ్యక్షురాలు షర్మిల అయితే.. అటువైపు 43 ఏళ్ల బీజేపీకి కూడా మహిళనే అధ్యక్షురాలిగా ఉండడం విశేషం.

ఇద్దరూ మాజీ సీఎంల బిడ్డలు

బీజేపీ 1980లో ఆవిర్భవించింది. అప్పటికి టీడీపీ పుట్టలేదు. 1982లో టీడీపీని దివంగత మహా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించారు. కాగా, 1980లొ ఉమ్మడి ఏపీలో బీజేపీకి పీవీ చలపతిరావు తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు వంటి దిగ్గజ నాయకులు అధ్యక్షులుగా వ్యవహరించారు. మరోవైపు ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, 2023 జూలైలో ఏపీ బీజేపీ చీఫ్ గా మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి నియమితలయ్యారు. ఇప్పడు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. వీరిద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు కావడం విశేషం. ఒక పెద్ద రాష్ట్రంలో నామమాత్రంగా మారిన రెండు జాతీయ పార్టీలకు మహిళలే అధ్యక్షులు కావడం మరో విశేషం.

అటు అన్న ఇటు మరిది.. ఎలా ముందుకెళ్తారో?

వచ్చే ఎన్నికల్లో ఏపీ బీజేపీ పయనం ఎలా ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ-జనసేన కూటమితో పొత్తు ఉంటుందా..? లేక ఒంటరి పోటీనా? అనేది బీజేపీ వైపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ టీడీపీని నడిపిస్తున్నది పురందేశ్వరి మరిది, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కావడం గమనార్హం. మరోవైపు ఏపీలో జవ జీవాలు లేని కాంగ్రెస్ ను షర్మిల ఎక్కడికి తీసుకెళ్తారనేది కీలకం. అంతేగాక.. తన తండ్రి పేరిట సొంత అన్న స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ ను ఆమె ఎదుర్కొనాల్సి ఉండడం గమనార్హం. ఇప్పటికైతే కాంగ్రెస్ కు ఏపీలో పొత్తుల పరంగా కలిసివచ్చేది రెండు వామపక్షాలు మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈ మూడు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. నామమాత్రమే అయినప్పటికీ ఏపీలోనూ కలిసి వెళ్లక తప్పదు. చూద్దాం.. ఎన్నికలపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో..?