Begin typing your search above and press return to search.

అమ్మ అనీలూ.. ఇంత కథ నడిపావా?

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు, అభియోగాలూ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   26 Jun 2024 10:03 AM GMT
అమ్మ అనీలూ.. ఇంత కథ నడిపావా?
X

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు, అభియోగాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్యాయం జరిగినవారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

ముఖ్యంగా 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైసీపీ తరఫున అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌ జగన్‌ తొలి విడత కేబినెట్‌ లో దాదాపు మూడేళ్లు ఆయన కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

పోలవరం ప్రాజెక్టుపై మంత్రిగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చేసిన ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి, ఈ ప్రాజెక్టు పూర్తికి ఆయన పలుమార్లు తేదీలను ప్రకటించారు. ఆ తేదీల నాటికల్లా పోలవరంను పూర్తి చేస్తామని చెప్పారు. మూడేళ్ల తర్వాత ఆయన స్థానంలో మంత్రిగా అంబటి రాంబాబు వచ్చారు. దీంతో పోలవరంపై ప్రశ్నించిన జర్నలిస్టులకు తాను మంత్రిని కాదని.. కొత్త మంత్రి ఉన్నారని ఆయననే అడగాలని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తప్పించుకున్నారు.

కాగా తాజా ఎన్నికల్లో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ను నరసరావుపేట ఎంపీగా జగన్‌ పోటీ చేయించారు. అయితే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఓటమి పాలయ్యారు.

తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. మీసం తిప్పి మరీ అనిల్‌ సవాల్‌ కూడా చేశారు.

కాగా తన భూమిని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కబ్జా చేశారని ఒక మహిళ ఆయనపై ఫిర్యాదు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. నెల్లూరు భగత్‌ సింగ్‌ కాలనీలోని తన భూమిని ఆయన కబ్జా చేశారంటూ కౌసర్‌ జాన్‌ అనే ముస్లిం మహిళ నెల్లూరు చిన్నబజార్‌ సీఐకి ఫిర్యాదు ఇచ్చింది.

అంతేకాకుండా అక్రమంగా స్వాధీనం చేసుకున్న తన భూమిలో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని కౌసర్‌ జాన్‌ ఆరోపించారు. ఈ కేసులో తనకు న్యాయం చేయాలని ఏడాది కాలంగా దీక్ష చేస్తున్నానని ఆమె తెలిపారు. ఎన్నోసార్లు అనిల్‌ వద్దకు, వైసీపీ నేతల వద్దకు వెళ్లినా తనకు న్యాయం దక్కలేదని వాపోయారు.

ఈ భూమిని తన భర్త 2002లోనే కొనుగోలు చేశాడని కౌసర్‌ జాన్‌ తెలిపారు. అయితే వైసీపీ భవనాన్ని నిర్మించేందుకు తన భూమిలో అనిల్‌ 2.8 ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.

కబ్జా చేసిన భూమిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి కర్త, కర్మ.. క్రియ మొత్తం అనిల్‌ కుమారేనని బాధితురాలు కౌసర్‌ జాన్‌ ఆరోపించారు. ఆయనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేసి తనకు న్యాయం చేయాలన్నారు.

కాగా ఈ వ్యవహారంపై రెండ్రోజులుగా రచ్చ జరుగుతున్నా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కానీ.. వైసీపీ నేతలు కానీ ఎవరూ స్పందించలేదు. కబ్జా చేసిన భూమి కాకపోతే భయం ఎందుకని.. మీడియా ముందుకొచ్చి మాట్లాడవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.