Begin typing your search above and press return to search.

పెళ్లి మండపానికి కత్తి.. యాసిడ్ బాటిల్: అన్నమయ్య జిల్లాలో యువతి హల్ చల్!

రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషాకు తనకు పదేళ్లుగా రిలేషన్ ఉందంటూ తిరుపతికి చెందిన యువతి ఆరోపిస్తోంది.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:44 AM GMT
పెళ్లి మండపానికి కత్తి.. యాసిడ్ బాటిల్: అన్నమయ్య జిల్లాలో యువతి హల్ చల్!
X

అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. అప్పటివరకు పెళ్లి వేడుకతో ఉత్సాహంతో ఉన్న పెళ్లి మండపంలో కలకలం రేగటమే కాదు.. భయంతో పరుగులు తీసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితికి కారణం.. పెళ్లి మండపానికి కత్తి.. యాసిడ్ బాటిల్ తో వచ్చిన యువతి.. పెళ్లి కొడుకు తనను మోసం చేశాడంటూ ఆరోపణలు చేయటమే కాదు.. దాడికి పాల్పడే ప్రయత్నం చేసింది. అంతేకాదు.. పదేళ్లు రిలేషన్ షిప్ లో ఉండి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అంటూ నిప్పులు జరిగింది. అన్నమయ్య జిల్లా ఆదివారం నందలూరులో జరిగిన ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషాకు తనకు పదేళ్లుగా రిలేషన్ ఉందంటూ తిరుపతికి చెందిన యువతి ఆరోపిస్తోంది. కొద్ది రోజులుగా బాషా తనకు కనిపించకుండా తిరుగుతున్నట్లుగా ఆమె చెబుతున్నారు. దీంతో అనుమానం వచ్చిందని.. అతన్ని వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చానని.. అతడి గురించి ఆరా తీస్తే పెళ్లి చేసుకుంటున్న విషయం తనకు తెలిసిందని ఆమె మండిపడుతున్నారు.

తనకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు తాను పెళ్లి జరుగుతున్న షాదీ ఖానాకు వచ్చినట్లుగా చెబుతూ.. తనను మోసం చేసిన పెళ్లి కొడుకును నిలదీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చేతిలో కత్తి.. ఇంకో చేత్తో యాసిడ్ బాటిల్ తో హల్ చల్ చేసిన ఆమెపై పెళ్లి కొడుకు బాషా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.తనపై ఆరోపణలు చేస్తున్న యువతిపై కత్తితో ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో చేతిలో ఉన్న బాటిల్ లోని యాసిడ్ కరిష్మా అనే మహిళ ముఖంపై పడి గాయాలయ్యాయి. అదేసమయంలో.. కత్తితో తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ భుజంపై బలంగా పొడిచేశాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

దీంతో.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇద్దరికి ప్రాణాపాయం లేదని చెబుతున్నారు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ యువతి తరఫు బంధువులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసుల్ని నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఆరోపణలు చేసిన యువతిని పోలీసులు ఒక గదిలో ఉంచారు. ఆమె ఇంకెవరితోనూ మాట్లాడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.