17వ లోక్ సభ రద్దు.. మురిగిపోయిన అత్యంత కీలక బిల్లు.. బాలికలకు దెబ్బే
యుక్త వయసుకు ముందే వివాహం చేయడం బాలికలను మున్ముందు అనేక వ్యాధులకు గురిచేస్తుంది.
By: Tupaki Desk | 9 Jun 2024 11:21 AM GMTఅధిక జనాభా కావొచ్చు.. పేదరికం కావొచ్చు.. అనాదిగా వస్తున్న ఆచారం కావొచ్చు.. భారత దేశంలో ఉన్న అత్యంత వివాదాస్పద సంప్రదాయాల్లో ఒకటి.. అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం.. ఇప్పుడు చాలావరకు తగ్గింది కానీ.. గతంలో 10 ఏళ్లు నిండకుండానే వివాహాలు చేసిన సంఘటనలు చూశాం. ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతుండడం వాటిని చైల్డ్ డెవలప్ మెంట్ అధికారులు అడ్డుకుంటుండడం మనందరమూ మీడియాలో చూస్తున్నాం.
యుక్త వయసుకు ముందే వివాహం చేయడం బాలికలను మున్ముందు అనేక వ్యాధులకు గురిచేస్తుంది. వివాహం.. ఆపై ఒకటికి రెండుసార్లు గర్భందాల్చడంతో బాలికలు సులువుగా వ్యాధుల ముప్పనకు గురవుతుంటారు. కాగా, భారత దేశంలో కొన్నేళ్ల కిందటనే బాలికల కనీస వివాహ వయసును 18 ఏళ్లు నిర్దారించారు.
21 ఏళ్లకు పెంచాలనే డిమాండ్..
మన దేశంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా అమ్మాయిల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాలనే అభిప్రాయం చాన్నాళ్లుగా ఉంది. కొన్ని దశాబ్దాలుగా భారత అమ్మాయిలు అనేక రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. అకాశంలో సంగం అవకాశాల్లోనూ సగం అంటూ దూసుకెళ్తున్నారు. చైతన్యవంతులైన మహిళలు సమాజంలో స్ఫూర్తి రగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో యువతుల వివాహ వయసు పెంపుపై డిమాండ్ వస్తోంది.
ఆ బిల్లు చట్టమైంది.. ఈ బిల్లు ఆగింది..
దేశంలో మొన్న రద్దయినది పదిహేడవ లోక్ సభ. ఆదివారం మోదీ ప్రమాణ స్వీకారంతో 18వ లోక్ సభ మొదలుకానుంది. కాగా, 17వ లోక్ సభ గడువు తీరిపోవడంతో యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన కీలక బిల్లు మురిగిపోయింది. ఈ బిల్లును 2021 డిసెంబరులో ప్రవేశపెట్టారు. దీని పేరు బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు-2021. లోక్ సభలో పెట్టిన అనంతరం బిల్లును విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరీశీలనకు పంపించారు. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్న యువతుల పెళ్లి వయసును పురుషులతో సమానంగా 21ఏళ్లకు పెంచాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. కానీ, ఇక్కడినుంచి ముందుకు కదల్లేదు. కాగా, 17వ లోక్ సభ కాల వ్యవధిలోనే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే అత్యంత కీలక బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ బిల్లు చట్టరూపం కూడా దాల్చింది. 2029 ఎన్నికల నుంచి ఇది అమల్లోకి రానుంది. కానీ, యువతుల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన బిల్లు మాత్రం పెండింగ్ లో పడింది.