Begin typing your search above and press return to search.

దాడి చేశారంటూ మహిళా ఎంపీ సీఎం ఇంటి నుంచి ఫోన్ చేసింది!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీపార్టీ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది.

By:  Tupaki Desk   |   14 May 2024 5:40 AM GMT
దాడి చేశారంటూ మహిళా ఎంపీ సీఎం ఇంటి నుంచి ఫోన్ చేసింది!
X

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీపార్టీ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి ఫోన్ చేసిన ఆ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఒకరు సీఎం సహాయకుడు ఒకరు తనపై దాడికి పాల్పడినట్లుగా ఆమె పోలీసులకు స్వయంగా ఫోన్ చేయటం షాకింగ్ గా మారింది. అయితే.. దీనికి సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఇంతకూ అసలేం జరిగింది? అన్న విషయంలోకి వెళితే..

సోమవారం ఉదయం 9.34 గంటల వేళలో ఢిల్లీ సీఎం ఇంటి నుంచి పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో ఒక మహిళ మాట్లాడుతూ తనను ముఖ్యమంత్రి సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేసినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఒక టీం ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు. అక్కడ ఎంపీతో భేటీ అయిన ఆమె.. తాను కంప్లైంట్ ఇవ్వటానికి స్టేషన్ కు వస్తానని చెప్పారు.

అన్నట్లే.. కాసేపటికి సదరు ఎంపీ స్వాతి మాలీవాల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దాడి జరిగినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో ఆలోచనలో పడ్డ ఆమె.. ఐదు నిమిషాల్లో తాను వస్తానని చెప్పి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. మహిళా ఎంపీపై దాడి చేసిన బిభవ్ కుమార్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి హోదాలో బిభవ్ కుమార్ ను నియమించటం.. అది చట్టవిరుద్ధంగా పేర్కొనటం తెలిసిందే. అతడి మీద ఆరోపణలతో ఢిల్లీ విజిలెన్స్ విభాగం కుమార్ ను తొలగించింది. లిక్కర్ స్కాంలోనూ అతడిపై ఈడీ సమన్లు ఇచ్చింది. ఇదిలా ఉంటే.. సీఎం ఇంట్లోనే మహిళా ఎంపీపై దాడి జరిగిన వైనంపై విచారణ చేపట్టాలని కోరుతూ బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఇంతకూ ముఖ్యమంత్రి ఇంట్లో ఆయన సహాయకుడు ఒకరు పార్టీ మహిళా ఎంపీపై ఎందుకు దాడి చేశారు? దానికి దారి తీసిన కారణాలు ఏమిటి? లాంటి అంశాలు ఇప్పుడు చర్చగా మారాయి.