కవితది గురివింద గింజ నీతేనా ?
అదిఎప్పటికి జరుగుతుందో ఏమో ఎవరికీ తెలీదు. అందుకనే దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు వాయిదాలు పడుతునే ఉంది
By: Tupaki Desk | 7 Sep 2023 4:30 AM GMTకల్వకుంట్ల కవిత వ్యవహారం అచ్చంగా గురివింద గింజనీతిని తలపిస్తోంది. విషయం ఏమిటంటే పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ అయ్యేందుకు అన్నీ పార్టీలు సహకారం అందించాలని ఆమె కోరారు. ఈ మేరకు అన్నీ పార్టీలకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవటాన్ని ఆమె గుర్తుచేశారు. ఇందుకు రాబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అందరు కలిసి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
ఇంతవరకు కవిత అడిగిన విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు, రెండో ఆలోచన లేదు. చట్టసభల్లో మహిళ ప్రాతినిధ్యం ఉండాల్సినంత ఉండటంలేదని దశాబ్దాలుగా చర్చలు జరుగుతునే ఉన్నాయి. అయితే పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం లేదని చెబుతున్న కవిత మరి అసెంబ్లీ సంగతిని ఎందుకు మాట్లాడటంలేదు. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే చాలాపార్టీలు పెద్దమనసుతో అంగీకరించాలి.
అదిఎప్పటికి జరుగుతుందో ఏమో ఎవరికీ తెలీదు. అందుకనే దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు వాయిదాలు పడుతునే ఉంది. ఈ నేపధ్యంలోనే తెలంగాణా అసెంబ్లీలో మహిళలకు సముచితస్ధానం కల్పించమని తన తండ్రి కేసీయార్ ను ఎందుకు అడగటంలేదు ? తెలంగాణా అసెంబ్లీలో కూడా 33 శాతం మహిళా ప్రాతినిధ్యం కల్పించాలని తన తండ్రిని కవిత ఎప్పుడైనా అడిగారా ? 119 నియోజకవర్గాల్లో 33 శాతం అంటే 39 నియోజకవర్గాలు.
మరి అన్ని సీట్లు ఎప్పుడైనా కేసీయార్ మహిళలకు కేటాయించారా ? ఎప్పుడూ లేదు. మహాయితే నాలుగు సీట్లు లేకపోతే ఐదుసీట్లంతే. తాజాగా ప్రకటించిన సీట్లలో కూడా కేసీయార్ మహిళలకు కేటాయించిన సీట్లు ఏడు మాత్రమే. అసెంబ్లీలో తన తండ్రితో చెప్పి 39 సీట్లు మహిళలకు ఇప్పించలేని కవిత పార్లమెంటులో 33 శాతం కోసం అందరినీ అడగటమే విచిత్రంగా ఉంది. తన చేతిలోని పనిని వదిలేసి మిగిలిన వాళ్ళని మహిళా రిజర్వేషన్ బిల్లుకోసం మద్దతు ఇవ్వండి, పోరాటం చేయండని పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది. తెలంగాణా అసెంబ్లీలో ముందు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వర్తింపచేస్తే కవిత మాటకు విలువుంటుంది. లేకపోతే కవితను ఎవరు పట్టించుకోరు.