ఇకపై నో 'లేడీస్ టైలర్స్'... కారణం ఇదే!
అయితే... ఇకపై మహిళల దుస్తులు పురుషులు కుట్టకూడదు అనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 8 Nov 2024 10:30 AM GMTబోటిక్స్, ఫ్యాషన్ డిజైనర్స్ కాలం రానప్పటి నుంచీ లేడీస్ టైలర్స్ అనే ప్రొఫెషన్ చాలా ఫేమస్ అని చెబుతుంటారు. ఒక ప్రాంతంలో సుమారు పది మంది దర్జీలు ఉంటే.. వారిలో ఒకరిద్దరికి మాత్రమే లేడీస్ దుస్తులు కుట్టడంలో చేయి తిరిగి ఉంటుందని చెప్పుకునేవారు. అయితే... ఇకపై మహిళల దుస్తులు పురుషులు కుట్టకూడదు అనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
అవును... మహిళల దుస్తులను పురుష టైలర్లు కుట్టకూడదనే ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. పురుషుల దురుద్దేశాలను నిరోధించడంతోపాటు "బ్యాడ్ టచ్" నుంచి మహిళలను రక్షించేందుకే ఈ కీలక ప్రతిపాదన అని చెబుతున్నారు.
ఇదే సమయంలో... అమ్మాయిలకు హెయిర్ కట్ పనులు కూడా ఇకపై పురుషులు చేయకూడదని యూపీ స్టేట్ మహిళా కమిషన్ ప్రతిపాదించింది. ఈ మేరకు ఈ విషయాలను మహిళా కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ వెల్లడించారు. ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్ ఈ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన హిమానీ అగర్వాల్... అమ్మాయిల దుస్తుల కొలతలు మహిళలు మాత్రమే తీసుకోవాలని.. సెలూన్ లలో మహిళా కస్టమర్లకు అమ్మాయిలే హెయిర్ కట్ చేయాలని.. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని.. బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించేందుకే ఈ ప్రతిపాదనలు చేశామని తెలిపారు.
వీటిని త్వరలో రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి.. ఈ నిబంధనల మేరకు చట్టం తీసుకొచ్చెలా కోరతామని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదే సమయంలో.. ఈ ప్రతిపాదనలు యూపీకే పరిమితమవుతాయా.. లేక, దేశంలోని మిగతా రాష్ట్రాలకూ వ్యాపిస్తాయా అనే చర్చా మొదలైంది!