తెలంగాణ ఉమెన్స్ కాలేజీలో ర్యాగింగ్.. 81 మంది సస్పెన్షన్
ర్యాగింగ్.. సాధారణంగా ఈ మాట వినగానే యువకులే కళ్ల ముందు మెదులుతారు. ర్యాంగింగ్ భూతానికి బలైన వారు కూడా ఉన్నారు.
By: Tupaki Desk | 23 Dec 2023 10:33 AM GMTర్యాగింగ్.. సాధారణంగా ఈ మాట వినగానే యువకులే కళ్ల ముందు మెదులుతారు. ర్యాంగింగ్ భూతానికి బలైన వారు కూడా ఉన్నారు. ర్యాగింగ్‌ను కట్టడి చేసేందుకు కళాశాలలు అనేక చర్యలు తీసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే.. ఈ సంస్కృతి ఇప్పుడు మహిళా కాలేజీలకు కూడా పాకింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న ఉమెన్స్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వ్యవహారం రాష్ట్రంలోతీవ్ర సంచలనం సృష్టించింది.
వరంగల్ ఉమెన్స్ కాలేజీలో ఈ ఏడాది కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థినులపై సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ చేసి వేధించిన ఘటన వెలుగు చూసింది. ఈ ర్యాగింగ్‌ను తాళలేక.. చాలా మంది విద్యార్థినులు కళాశాలను విడిచి పెట్టేశారు. దీంతోఆరా తీసిన ప్రిన్సిపాల్.. విషయం తెలుసుకున్నారు. అయితే.. ఇదే తొలి సారి కాకపోవడం.. గతంలోనూ సీనియర్ విద్యార్థినులు.. వేధించిన ఘటనలు ఉండడంతో ఏకంగా 81 మంది విద్యార్థినులపై వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు.
ఆ వెంటనే వారిని కాలేజీ హాస్టళ్ల నుంచిఖాళీ చేయించారు. ఇదిలావుంటే.. వేధింపులకు గురైన విద్యార్థినుల కథనం మేరకు.. నిత్యం వారిని సీనియర్లు దూషించేవారు. పరమ అసభ్య కర పదాలతో దూషించడంతో పాటు.. లైంగికంగా కూడా వేధింపులకు గురి చేశారు. దుస్తులు విప్పాలని.. జడలు విరబోసుకుని తిరగాలని.. వేధించినట్టు జూనియర్ విద్యార్థినులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఉన్నత విద్యాశాఖ విచారణకు సైతం ఆదేశించింది.