Begin typing your search above and press return to search.

మహిళలు ప్రధాన కేంద్రంగా ఎన్నికలు.. చరిత్రలో ఈ స్థాయిలో తొలి

జనాభాలో సగం.. అవకాశాల్లో సగం.. ఉద్యోగాల్లో సగం.. అంటూ మహిళా లోకం భారత దేశంలో కొన్ని దశాబ్దాలుగా గళమెత్తుతోంది.

By:  Tupaki Desk   |   10 May 2024 11:30 PM GMT
మహిళలు ప్రధాన కేంద్రంగా ఎన్నికలు.. చరిత్రలో ఈ స్థాయిలో తొలి
X

జనాభాలో సగం.. అవకాశాల్లో సగం.. ఉద్యోగాల్లో సగం.. అంటూ మహిళా లోకం భారత దేశంలో కొన్ని దశాబ్దాలుగా గళమెత్తుతోంది. మారుతున్న కాలానికి తగినట్లు మహిళలు కూడా చైతన్యం అవుతున్నారు. గత మూడు దశాబ్దాల్లోనే ఎంతో ముందుకెళ్లారు. అంతెందుకు..? ప్రస్తుతం పార్టీలన్నీ కూడా మహిళలకు మ్యానిఫెస్టో తీసుకొస్తున్నాయి. కుటుంబంలో కీలక వ్యక్తి అయిన ఆమెను ఓటు బ్యాంకుగా గాక.. ఫలితాన్ని నిర్దేశించే శక్తిగా చూస్తున్నాయి. ఇక దాదాపు 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు మెజారిటీ పార్టీలు ఆమోదం తెలపడం ఈ ఏడాదిలో చోటుచేసుకున్న గొప్ప పరిణామం అని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల సంగతికి వస్తే తెలంగాణలో ప్రస్తుతం లోక్ సభకు, ఏపీలో లోక్ సభ, అసెంబ్లీకి కలిపి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో గమనించాల్సినది ఏమంటే.. మహిళలు ప్రధాన కేంద్రంగా ఈ ఎన్నికలు నడుస్తుండడం.

తెలంగాణ బరిలో ఆమె లేరు..

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేకుండానే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత దాదాపు రెండు నెలలుగా తిహాడ్ జైల్లోనే ఉన్నారు. 2014లో ఎంపీగా నిజామాబాద్ నుంచి గెలిచి 2019లో ఓడిన కవిత ఈసారి ఎన్నికలకు ముందే అరెస్టయ్యారు. ఒకవేళ బయట ఉండి ఉంటే నిజామాబాద్ లో పోటీ చేసేవారా? లేదా? అనేది తర్వాతి సంగతి. అయితే, తమ కుమార్తెను అన్యాయంగా అరెస్టు చేశారంటూ కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కవిత సోదరుడు కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

ఏపీలో కీలకంగా..

ఏపీ రాజకీయాలకు వస్తే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అనూహ్యంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. ఆమె ప్రస్తుత ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేస్తున్నారు కూడా. ఇక షర్మిల తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్యను పదేపదే ప్రస్తావిస్తూ, ఆయన కూతురు డాక్టర్ సునీతారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. అనివార్యం అయినప్పటికీ షర్మిల రాజకీయ ప్రయాణాన్ని అన్న జగన్ ప్రస్తావించాల్సి వస్తోంది. మరోవైపు వివేకా హత్య కేసులో షర్మిల తన వదిన వైఎస్ భారతిని కూడా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్య కూడా ఈ ఎన్నికల సందర్భంగా బయటకు రావడం గమనార్హం. కాగా, ఎన్నికల్లో తన భర్త వైఎస్ జగన్ తరఫున భారతి పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో షర్మిల, సునీతారెడ్డి, భారతి ప్రధాన కేంద్రంగా మారారు. ఏపీలో ఉమెన్ సెంట్రిక్ గా ఎన్నికలు... గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి.

జాతీయ స్థాయిలో..

కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో గతంలో కంటే చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆమె తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే కథనాలు వచ్చాయి. కానీ, అదేమీ లేకుండా.. రాయ్ బరేలీలో తన అన్న గెలుపునకు ప్రచారం చేస్తున్నారు. శనివారం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

అగ్ర నేత లేకుండానే..

25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. రాయ్ బరేలీ సిటింగ్ ఎంపీ అయిన ఆమె అనారోగ్యం కారణంగా ఈసారి పోటీ చేయడం లేదు. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సొంత రాష్ట్రంలో శక్తినంతా ధారపోస్తున్నారు. జాతీయ పార్టీ అయినప్పటికీ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ కే పరిమితం అయ్యారు.