Begin typing your search above and press return to search.

ఈసీ ఫైనల్ లెక్కలొచ్చేశాయి... ఏపీలో వణుకు వీరికేనా..?

ఈ క్రమంలో తాజాగా తెరపైకి వచ్చిన ఓ లెక్కపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అదే తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నియోజకవర్గాల వారి పోలింగ్ లెక్కలు.

By:  Tupaki Desk   |   15 May 2024 11:04 AM GMT
ఈసీ ఫైనల్  లెక్కలొచ్చేశాయి... ఏపీలో వణుకు వీరికేనా..?
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రజానికం! వీటికోసం జూన్ 4 వరకూ వెయిట్ చేయాల్సిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇందులో కొన్ని విశ్వాసంతో కూడుకున్నవి కాగా.. కొన్ని, ఆత్మవంచనకు సాదృశ్యంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా తెరపైకి వచ్చిన ఓ లెక్కపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అదే తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నియోజకవర్గాల వారి పోలింగ్ లెక్కలు. ఇందులో ప్రధానంగా స్త్రీ పురుషుల పోలింగ్ వివరాలు స్పష్టంగా వెల్లడించారు. దీంతో... ఈ లెక్కలు ఇప్పుడు సరికొత్త చర్చకు తెరతీశాయని చెబుతున్నారు. అసలు ఈ లెక్కలేమిటి.. టెన్షన్ ఎవరికి అనేది ఇప్పుడు చూద్దాం...!

అవును... సోమవారం ఏపీలో ముగిసిన పోలింగ్ కి సంబంధించి నియోజకవర్గాల వారీగా స్త్రీ పురుషులు ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారనే వివరాలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఈ వివరాల ప్రకారం... ఏపీలో 16,430,359 మంది పురుషులు, అలాగే 16,908,684 కోట్ల మంది మ‌హిళ‌లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

అంటే మ‌గ‌వాళ్ల కంటే దాదాపు ఐదు ల‌క్షల మంది మ‌హిళా ఓట‌ర్లు అధికంగా తమ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ లెక్కలు తెరపైకి రావడంతో వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం... మ‌హిళా ఓట‌ర్లు ఎక్కువ‌గా పోలింగ్ లో పాల్గొనడమే! వాస్తవానికి 55 నుంచి 60 శాతం మహిళా ఓట్లు వైసీపీ వైపే అని ప‌లు స‌ర్వే సంస్థలు వెల్లడించాయని చెబుతున్నారు!

దీంతో ఈ విషయం కూటమినేతలను టెన్షన్ కి గురిచేస్తుందని చెబుతున్నారు. పైగా గరిష్టంగా జగన్ తన సంక్షేమ పథకాలను మహిళ ద్వారానే కుటుంబానికి అందిస్తున్నారు. ఇదే సమయంలో 31 లక్షల ఇళ్ల పట్టాలనూ మహిళల చేతికే అందించారు. పైగా మహిళలకు జగన్ పై కోపం ఉండటానికి అంత బలమైన కారణాలు లేవని చెబుతున్నారు!

ఇదే సమయంలో జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు తాను అందిస్తానని చంద్రబాబు చెబుతున్నప్పటికీ... మహిళలు అంత రిస్క్ చేసే అవకాశం ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు! ఈ సందర్భంగా 2014 - 19 నాటి రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నారని.. డ్వాక్రా రుణాల మాఫీ అంశం వారి కళ్లముందు సాక్ష్యాత్కరిస్తుందని.. ఫలితంగానే భారీగా మహిళా ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు!

ఇలా ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళా ఓటర్లు దాదాపు ప్రతీ నియోజకవర్గంలోనూ అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడంపై వైసీపీ హర్షం వ్యక్తం చేస్తుంటే.. కూటమి ఆందోళన వ్యక్తం చేస్తుందని చెబుతున్నారు. ఎవరు ఏమి చెప్పినా జూన్ 4 వరకూ వేచి చూస్తే.. అన్ని విషయాలపైనా స్పష్టత రాబోతోంది!!