Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రం హోం జాబ్స్... 11 మంది కలిసి రూ.158 కోట్లు కొట్టేశారు!

ఈ నేపథ్యంలో.. ఇదే అదనుగా వర్క్ ఫ్రం హోం జాబ్స్ అంటూ ఆఫర్ చేసి నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టింది ఒక పెద్ద గ్యాంగ్!

By:  Tupaki Desk   |   31 Jan 2024 4:17 AM GMT
వర్క్  ఫ్రం హోం జాబ్స్... 11 మంది కలిసి రూ.158 కోట్లు  కొట్టేశారు!
X

కోవిడ్ మహమ్మారి వల్ల వర్క్ ఫ్రం హోం అనే ఆప్షన్ ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇంటి నుంచే పనిచేసుకునే విధానానికి ప్రధానంగా సాఫ్ట్ వేర్ రంగానికి చెందినవారు చాలా మట్టుకు అలవాటైపోయారని.. ఆ విధానానికి స్వస్థి చెప్పి ఆఫీసులకు రమ్మని చెబుతున్నా ఆసక్తిచూపించేవారు తక్కువవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇదే అదనుగా వర్క్ ఫ్రం హోం జాబ్స్ అంటూ ఆఫర్ చేసి నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టింది ఒక పెద్ద గ్యాంగ్!

అవును... వర్క్ ఫ్రం హోం జాబ్స్ అంటూ బెంగళూరులోని ఒక గ్యాంగ్ భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడింది. ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఈ విషయంపై ఫిర్యాదులు రావడం.. బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగడం.. వీరికోసం గాలింపు చేపట్టడంతో ఈ బ్యాచ్ పోలీసులకు పట్టుబడింది. ఈ సందర్భంగా వారి చేతిలో మోసపోయిన వారి లిస్ట్, వారి ద్వారా వీరు సంపాదించిన సొమ్ము చూసిన వారికి ఒక్కసారిగా దిమ్మతిరిగిందని అంటున్నారు. ఆ స్థాయిలో వీరి దందా కొనసాగిందని చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ నుంచి ముగ్గురు, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు, ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది.. మొత్తం 11 మంది కలిసి బెంగళూరు కేంద్రంగా వర్క్ ఫ్రం హోం దందాకు తెరలేపారు. పార్ట్ టైం, వర్క్ ఫ్రం హోం జాబ్స్ కోసం వెతుకుతున్న యువతీ యువకులను లక్ష్యంగా చేసుకున్న ఈ నిందితులు.. పక్కాప్లాన్ తో వారిని ముగ్గులోకి దింపుతున్నారు. సోషల్ మీడియాలో పలు అకౌంట్లలో... ఇంట్లో ఉండే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తామంటూ ప్రకటనలు ఇచ్చి వారిని వలలో వేసుకుంటున్నారు.

ఈ ప్రచారంతో పాటు రద్దీగా ఉన్న కాలేజీల వద్ద, బస్ స్టేషన్‌ గోడలపైనా పోస్టర్లు అతికించారు. ఇంట్లో కూర్చొని ప్రతినెల వేల రూపాయలు సంపాదించడానికి చక్కటి అవకాశం ఇస్తామని నమ్మించి మోసం చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని తెలుస్తుంది. ఇలా వీలైనంత ఎక్కువగా ప్రచారం చేస్తూ.. ఆకర్షితులైన వారిని జాగ్రత్తగా డీల్ చేస్తూ.. వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూల్ చేసి.. అనంతరం వారితో కాంటక్ట్ కట్ చేసేవారంట.

దీంతో బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మోసగాళ్లను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌ లో మొత్తం పదకొండు మందిని అరెస్టు చేశారని తెలుస్తుంది. అరెస్టు అయిన వారిలో తెలంగాణ, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారని తెలుస్తుంది. వీరంతా ఇప్పటివరకూ సుమారు 2,143 మందిని మోసం చేశారని అంటున్నారు.. కేసు విచారణ కొనసాగుతోందని బెంగళూరు సైబర్ క్రైం, సీసీబీ పోలీసులు తెలిపారు.

ఇలా అరెస్టు అయిన నిందితుల నుంచి 11 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్‌ టాప్ లు, 15 సిం కార్డులు, 3 బ్యాంక్ చెక్ బుక్‌ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఇదే సమయంలో... ఇప్పటివరకు 2,143 ఖాతాల నుంచి రూ. 158 కోట్లా 94 లక్షలకు పైగా వారి అకౌంట్లకు బదిలీ చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసిందని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం 30 ఖాతాలను సీజ్ చేసిన పోలీసులు రూ. 62 లక్షల 83 వేల రూపాయల నగదును జప్తు చేశారని అంటున్నారు!!