భారత్ లోని దుర్భర పేదరికంపై ప్రపంచ బ్యాంక్ సంచలన నివేదిక!
ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ - 20లో కచ్చితంగా ఇద్దరు భారతీయులు ఉంటారు.
By: Tupaki Desk | 17 Oct 2024 9:30 AM GMTఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ - 20లో కచ్చితంగా ఇద్దరు భారతీయులు ఉంటారు.. ఇక భారత్ లోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద 2024 నాటికి తొలిసారిగా ట్రిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది.. గత ఏడాదితో పోలిస్తే సుమారు 40% పెరిగింది.. 2024 జీడీపీ ప్రకారం టాప్ - 5 దేశాల్లో 3.41 ట్రిలియన్ డాలర్లతో భారత్ నిలిచింది.
28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.. ఈ విషయంలో యూకే, ఫ్రాన్స్, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, స్పెయిన్ వంటి దేశాలు భారత్ కంటే వెనుకబడి ఉన్నాయి! అయినప్పటికి... దుర్భర పేదరికం ఈ దేశాన్ని వెంటాడుతోంది.
అవును... భారతదేశంలో పెరుగుతున్న అసమానతలు శాపంగా మారాయనే చర్చ బలంగా నడుస్తుంటుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో భారతీయులు ఉంటారు.. టాప్ - 5 జీడీపీ కలిగిన దేశాల్లోనూ భారత్ ఉంటుంది.. ఇదే సమయంలో దుర్భర పేదరికం కూడా దేశాన్ని వెంటాడుతోంది!
ఈ క్రమంలో తాజాగా ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... భారతదేశంలో 12.9 కోట్ల మంది ప్రజలు దుర్భర పేదరికంలో బ్రతుకుతున్నారని తెలిపింది. వీరి ఆదాయం రోజుకు $2.15 (సుమారు రూ.181) కంటే తక్కువగా ఉందని తాజా నివేదికలో పేర్కొంది.
మధ్యస్థ ఆదాయ దేశాల్లో రోజుకు $6.85 (సుమారు రూ.576) సంపాదించేవారిని పేదలుగా పరిగణిస్తూ రూపొందించిన ఈ నివేదికలో.. రూ.181 రూపాయలతో భారతదేశ పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది. రూ.576 రోజువారీ సంపాదనను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు 1990ల కంటే భారత్ లో పేదరికం దారుణంగా ఉందని వెల్లడించింది.
దీనికి ప్రధాన కారణం జనాభా పెరుగుదలేనని వివరించింది. పలు నివేదికల ప్రకారం అక్టోబర్ 13 - 2024 నాటికి భారతదేశ జనాభా 145.46 కోట్లుగా చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో ఇది 17.78%. ఫలితంగా... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మారింది. ఇది కూడా పేదరికానికి ఓ కారణం అని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది!
అయితే... ఇటీవల భారత ప్రభుత్వ విడుదల చేసిన గృహవినియోగం - వ్యయ సర్వే (హెచ్.సీ.ఈ.ఎస్)లో ఈ వివరాలను వెల్లడించలేదని పేర్కొంది! ప్రస్తుత పురోగతి ప్రకారం.. ప్రజలు రోజుకి $6.85 (సుమారు రూ.576) కంటే ఎక్కువ సంపాదించేలా చేయడానికి ఒక శతాబ్ధం కంటే ఎక్కువ సమయం పట్టొచ్చని నివేదిక పేర్కొంది.
ఇదే క్రమంలో... ప్రపంచ వ్యాప్తంగా ఈ పేదరిక నిర్మూలనా చర్యలు చాలా మందగమనంలో ఉన్నాయని ఆక్షేపించిన ప్రపంచ బ్యాంక్.. ఆఫ్రికా సహా పలు దేశాలు 2030 నాటికి దుర్భర పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించింది. అయితే.. ప్రపంచ పేదరికంలో భారత్ వాటా కొన్ని దశాబ్ధాలలోనే తగ్గే అవకాశం ఉందని తెలిపింది!